బీజేపీ యూటర్న్!

Narendra Modi

రానున్న ఎన్నికల్లో మోదీ మరోసారి అధికారం చేజిక్కించుకోవాలంటే ఇంద్రజాలికుడిలా మారాల్సిందేనని ఇటీవలే ఓ విదేశీ పత్రిక సంపాదకుడు పేర్కొన్నారు కూడా. వాస్తవాలను పక్కనపెట్టి, మంత్రజాలం చేస్తేనే మళ్లీ మోదీ గద్దెనెక్కే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. మోదీ సర్కార్ ఈబీసీ రిజర్వేషన్ల అంశాన్ని చూస్తుంటే.. అది వాస్తవమే అనిపిస్తోంది.

వైునారిటీలకు, వెనకబడిన తరగతుల కోటా (రిజర్వేషన్) విధానాన్ని వ్యతిరేకించే బీజేపీ హఠాత్తుగా రిజర్వేషన్ల అంశంలో యుటర్న్ తీసుకుందా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. రిజర్వేషన్ల విధానం వల్ల దేశంలో మేధోపరమైన శూన్యత ఏర్పడుతుందని, పోటీతత్వం తిరోగమనంలోకి వెళ్లుందని వాదించే బీజేపీ వంటి మతతత్వ పార్టీ అకస్మాత్తుగా ఎన్నికల్లో విజయం కోసం ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు పదిశాతం రిజర్వేషన్లు కల్పించేందుకుద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్‌కు సమర్పించింది. అంతాబాగానే ఉన్నప్పటికీ, ఈ బిల్లుపై బీజేపీకి ఉన్న చిత్తశుద్ధే ప్రశ్నార్థకంగా తయారైంది. గతంలో మహిళా రిజర్వేషన్ల బిల్లును దశాబ్దాల కాలం నుంచి కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టిన రాజకీయ పార్టీలకు హఠాత్తుగా ఈబీసీలకు రిజర్వేషన్ల అం శం గుర్తుకురావడం విస్మయం కలిగిస్తోంది. దాదాపు ముసాయిదా సిద్ధమై దానిపై రాజ్యసభ ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లు దుమ్ము దులిపి రంగంలోకి తీసుకొస్తే బీజేపీపై ప్రజల్లో సడలుతున్న విశ్వాసం కొంతవేురకు మెరుగుపడేది. కానీ, గతంలో అనేక సందర్భాల్లో ఈబీసీ రిజర్వేషన్లపై డిమాండ్లు ఉన్నప్పటికీ అప్పుడు ఉలకని అనేక రాజకీయ పార్టీలు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అనూహ్యంగా ప్రేమ చూపడం వెయ్యి డాలర్ల ప్రశ్నగా మిగిలింది. అంతేగానీ దాదాపు ఐదేళ్లపాటు మిన్నకుండి ఇప్పుడు ఎన్నికలు వస్తున్న సమయంలో ఈబీసీలను తలకెత్తుకోవడం చూస్తుంటే ఇది కచ్చితంగా రాజకీయ ప్రయోజనాలనుద్దేశించిందే కానీ, ఈబీసీలపై ప్రేమ పొంగిపొర్లి తీసుకున్న నిర్ణయం కాదని స్పష్టమవుతోంది. నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వానికి ఈ పార్లమెంట్ సమావేశాలే చివరి కాబట్టి ఎలాగోలా ఆర్థికంగా వెనకబడిన అగ్రకులాలను ఆకర్షించేందుకు ఇంతకు మించి మంచి అవకాశం ఉండకపోవచ్చునని భావించి వుండవచ్చు. కానీ, ఇందుకు సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించేందుకు పార్లమెంట్‌కు తగిన సమయం ఉండకపోవచ్చుననేది ఈ బిల్లు వెనకవున్న రాజకీయ ప్రయోజనాలను స్పష్టం చేస్తున్నాయి. రాజ్యాంగ సవరణలపై స్వాతంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో అనేక చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో రాజ్యాంగ నిర్మాతగా మనం గౌరవిస్తున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వంటి అగ్రనేతలు పాల్గొన్నారు. ఆ సమయంలోనే వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల అంశంపై కూడా చర్చ జరిగింది. ఫలితంగా సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు అనేవి రాజ్యాంగపరంగా ఉనికిలోకి వచ్చాయి. 

అనంతరం మండల్ కమిషన్ నివేదక వచ్చిన తరువాత ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ అంశాన్ని పరిశీలించింది. అప్పుడే ఆర్థికంగా వెనుకబడిన అంశం ప్రస్తావనకు వచ్చింది. కొన్నేళ్ల క్రితం సీనియర్ న్యాయవాది ఫాలి నారిమన్ క్రీమిలేయర్  అంశాన్ని తెరపైకి తెచ్చారు. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల్లో కొన్ని వర్గాలు ఆర్థికంగా ఉన్నతంగా ఉండొచ్చని, అలాంటి వారికి కూడా రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగపరంగా సరికాదని నారిమన్ అభిప్రాయపడ్డారు. నారిమన్ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు బెంచ్‌లోని ఐదుగురు సభ్యుల్లో నలుగురు న్యాయమూర్తులు అంగీకరించారు. వెనుకబడిన వర్గాలకు చెందిన జస్టిస్ పాండియన్ మాత్రం వ్యతిరేకించారు. ప్రస్తుతం తలపెట్టిన ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు కల్పించాలన్న నిర్ణయం గతంలో సుప్రీంకోర్టు అభిప్రాయానికి వ్యతిరేకమని, రాజ్యాంగపరంగా సరికాదని స్పష్టమవుతోంది. కానీ, ఈ అం శంలో రాజ్యాంగ సవరణ చేయడానికి ఇదే తగిన అదనుగా మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం భావిస్తోంది. ఇంత హడావుడిగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలోని ఔచిత్యాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. సరైన కసరత్తు లేకుండా, న్యాయపరమైన చిక్కుల గురించి యోచించకుండా, ఎవరితోనూ చర్చించకుండా, పార్లమెంట్‌లో చర్చకు తగిన సమయాన్ని కేటాయించే అవకాశం లేని నేపథ్యంలో ప్రభుత్వం ఎందుకింత తొందరపాటుగా వ్యవహరిస్తోందని విపక్షం అభ్యంతరం చెబుతోంది. కానీ, ఇక్కడ ఒక్క విషయం గమనంలోకి తీసుకోవాలి. ఇప్పుడు తీసుకొస్తున్న రాజ్యాంగ సవరణ ప్రకారం ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు. ఇది ఇక్కడితో ఆగుతుందా అంటే చెప్పలేమనే జవాబు వస్తోంది. రేపు ఇది 20 శాతానికి పెరగవచ్చు. ఇంత తక్కువ వ్యవధిలో, తక్కువ సాక్ష్యాలతో ఉన్న ఇలాంటి అతి ముఖ్యమైన అంశంపై నిర్ణయం రాజ్యాంగపరంగా, న్యాయపరంగా నిలుస్తుందా అన్నది ఆలోచించాల్సిన అంశం. అందువల్ల ఈ రాజకీయ వ్యూహంపై తప్పనిసరిగా న్యాయనిపుణులు, రాజ్యాంగ నిపుణుల అభిప్రాయాల మేరకు నిర్ణయం తీసుకోవలసిన అవసరమైంతెనా ఉన్నది. ఎలాగైనా తిరిగి అధికారంలోకి రావాలన్నది ఏ పాలకపక్షమైనా ఆశించడంలో తప్పులేదు. అందుకు తగిన వ్యూహాలను, అస్త్రశస్త్రాలను తయారుచేసుకోవడమూ తప్పుకాదు. కానీ, అందుకు తీసుకుంటున్న చర్యలు సమాజానికి, ప్రజలకు కీడు కలిగించని విధంగా ఉండాలి. కేవలం స్వప్రయోజనాలను, రాజకీయ కోణంలోనూ తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్తులో కలిగే నష్టాలను యోచించకుండా తొందరపాటు నిర్ణయాలు ఏ విధంగానూ హర్షణీయం కాదు. ఇప్పటికే గత నెలలో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో మాదిరిగా మోదీ ప్రభంజనం కనిపించలేదు. పైగా మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారాన్ని కోల్పోయి ప్రతిష్ఠను మసకబార్చుకున్నది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజలను మతపరంగాను, వర్గ పరంగాను ఆకర్షించడం ద్వారా అధికారాన్ని నిలుపుకోవాలనే ప్రయత్నాలు భాగంగా ప్రజల మనోభావాలను రెచ్చగొట్టేందుకు కూడా పాలకపక్షం వెనుకాడడం లేదు. అయోధ్యలో ఎట్టిపరిస్థితుల్లోను రామమందిర నిర్మాణం జరిగితీరుతుందని బీజేపీ నాయకులు రోజుకో హెచ్చరిక, పూటకో బెదిరింపుతో ప్రజలను భయభ్రాంతుల్ని చేసేందుకు వెనకాడడం లేదు. అలాగే ఇప్పుడు కొత్తగా కేరళలోని శబరిమల దేవాలయం వారికి అందివచ్చిన అవకాశంగా మారింది. ఒకపక్క సుప్రీంకోర్టు తీర్పుననుసరించి తెచ్చిన ట్రిపుల్ తలాఖ్ బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ ప్రతిపక్షాలను ప్రశ్నిస్తున్న కేంద్రం మాత్రం అదే సుప్రీంకోర్టు తీర్పును శబరిమల అంశంలో ఎందుకు పట్టించుకోవడం లేదో అంతుబట్టని చిక్కు ప్రశ్న. ఇలా పాలకపార్టీ ద్వంద్వ వైఖరితో వ్యవహరించడంలో దాగున్న మతలబు ఏమిటనే అనుమానాలు, సంశయాలు ప్రజల్లో తలెత్తుతున్నాయి. 

ఎన్నికలు సమీపిస్తున్నందువల్ల ప్రజల మనసులను గెలుచుకునేందుకు దగ్గరి దారుల్లో పాలకపక్షం పయనించడం సరైన విధానం కాదు. పరిస్థితులను గమనిస్తే మరిన్ని తాయిలాలతో రైతులను, విద్యార్థులను, నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు మరింత దగ్గరి దారులను అనుసరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాత్కాలిక ఉపశమన చర్యలు గాకుండా శాశ్వత పరిష్కారం చూపించే చర్యలపై దృష్టి పెట్టడం నిజమైన దేశభక్తుల కార్యాచరణగా నిలుస్తుంది. తమను వ్యతిరేకించేవారందరినీ దేశద్రోహులుగా, జాతి ద్రోహులుగా చిత్రీకరించే ధోరణి నుంచి బయటపడి సమాజంలో నిజంగా క్లేశాలు అనుభవిస్తున్న రైతులు, నిరుద్యోగులు, రైతు కూలీలపై దృష్టికేంద్రీకరించి వారి సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపేవారెవరినైనా ప్రజలు తలకెత్తుకుంటారు. అంతేగానీ, పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రం ఎప్పటికీ పనికిరాదు. ఏదో  తాత్కాలిక ప్రయోజనాన్ని కల్పించినా శాశ్వతంగా దేశం నష్టపోతుందనే విషయాన్ని పాలకపక్షం ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. రానున్న ఎన్నికల్లో మోదీ మరోసారి అధికారం చేజిక్కించుకోవాలంటే ఇంద్రజాలికుడిలా మారాల్సిందేనని ఇటీవలే ఓ విదేశీ పత్రిక సంపాదకుడు పేర్కొన్నారు కూడా. వాస్తవాలను పక్కనపెట్టి, మంత్రజాలం చేస్తేనే మళ్లీ మోదీ గద్దెనెక్కే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. మోదీ సర్కార్ ఈబీసీ రిజర్వేషన్ల అంశాన్ని చూస్తుంటే.. అది వాస్తవమే అనిపిస్తోంది. ఎన్నికల దగ్గర పడుతున్న వేళ నరేంద్ర మోదీ తన అంబులపొది నుంచి ఒక్కొ బాణాన్ని ఎక్కుపెట్టి...ప్రజలకు ఎర వేస్తున్నట్లు కనిపిస్తోంది. మరి వచ్చే ప్రజలు వాస్తవాలు గ్రహిస్తారో లేక, ఎన్డీయే సర్కార్‌కే పట్టం కడతారా అనేది తేలాలంటే మరికొద్ది నెలలు వేచి చూడాల్సిందే.
పార్వతి
9490793437

సంబంధిత వార్తలు