నువ్వొస్తానంటే.. నేనొద్దంటాను

Updated By ManamFri, 09/21/2018 - 01:55
bjp
  • ప్రముఖుల చేరికకు బీజేపీ విముఖత 

  • తాజాగా రిటైర్డ్ జడ్జికి పరాభవం.. రమేష్ రాథోడ్‌ను సైతం నో..?

imageహైదరాబాద్ : రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు పలు రాజకీయ పార్టీల్లో అగ్గిని రాజేస్తున్నాయి. టీఆర్‌ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడంతో ఆ పార్టీలో అసంతృప్తుల బెడద షురూవైంది.  జంపింగ్ జపాంగ్‌లు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. కొందరు ఇప్పటికే టీఆర్‌ఎ్‌స, కాంగ్రెస్ పార్టీల్లో  చేరిపోయారు. రాష్ట్రంలో ఒంటరిగా 119 స్థానాల్లో పోటీ చేస్తామని చెబుతున్న బీజేపీ పార్టీ తీరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. కమలం పార్టీలో చేరుతామని పలువురు నేతలు క్యూ కడుతుంటే  బీజేపీ మాత్రం చేర్చుకోవడంలేదని తెలుస్తోంది. చోటామోటా నాయకులు అడపాదడపా చేరుతున్నా రాష్ట్ర స్థాయిలో ప్రభావం చూపే నేతలు ఎవరూ రావడంలేదు. గురువారం రిటైర్డ్ జడ్జి జస్టిస్ రవీందర్‌రెడ్డి తన అనుచర గణంతో చేరడానికి రాష్ట్ర కార్యాలయానికి రాగా ఆయనకు పరాభవమే ఎదురైం ది. గురువారం కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధమవుతున్నా టీఆర్‌ఎస్ నేత, మాజీ ఎంపీ రమేష్‌రాథోడ్ సైతం పార్టీలోకి రావడానికి ఉత్సాహం చూపినా పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

రిటైర్డ్ జడ్జి జస్టిస్ రవీందర్‌రెడ్డికి పరాభవం..!
రిటైర్డ్ జడ్జి జస్టిస్ రవీందర్‌రెడ్డి.. మక్కాపేలుళ్లు కేసు తీర్పు సమయంలో ప్రముఖంగా వినిపించిన పేరు. తీర్పు వెల్లడించిన వెంటనే ఆయన స్వచ్ఛందంగా రిటైర్‌మెంట్ ప్రకటించి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలోనే ఆయన రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలు వినిపించాయి. ఇటీవల అమిత్ షా వచ్చిన సమయంలో షాను కలిసినట్టు తెలుస్తోంది. అందరూ అనుకున్నట్టుగానే బీజేపీలోకి చేరడానికి సిద్ధమయ్యారు. గురవారం రవీందర్‌రెడ్డి తన అనుచర గణంతో పార్టీలో చేరడానికి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. కానీ ఇక్కడే ఆయనకు తీవ్ర పరాభవం ఎదురైంది. పార్టీలో చేర్చుకునేందుకు ముఖ్య నేతలు ససేమిరా అన్నట్టు తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వద్దని చెప్పారని రాష్ట్ర నాయకత్వం కారణంగా చెబుతోందని, ఎంపీ బండారు దత్తాత్రేయ ఫోన్ చేసి తర్వాత చేర్చుకుంటామని చెప్పారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు దేశభక్తి ఎక్కువని, టికెట్ కోసం మాత్రమే కాదని బీజేపీలో చేరడంలేదని మండిపడ్డారు. 

రమేష్ రాథోడ్‌కు నో ..?
మాజీ ఎంపీ, టీఆర్‌ఎస్ నేత రమేష్‌రాథోడ్‌కు సైతం బీజేపీ నో చెప్పినట్టు సమాచారం. రమేష్ రాథోడ్.. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ టికెట్ ఆశించారు. అయితే అక్కడ టీఆర్‌ఎస్ సిట్టింగ్ కావడంతో తాజా మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు టికెట్ ఖాయం చేశారు. దీంతో టికెట్ రాకపోవడంతో రమేష్ రాథోడ్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. పార్టీకి గుడ్‌బై చెప్పాలని నిర్ణయించు కున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన బీజేపీ గూటికి చేరాలని ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. అయితే బీజేపీ మాత్రం వివిధ కారణాలతో చేర్చుకునేందుకు ససేమిరా అన్నట్టు తెలుస్తోంది. దీంతో రమేష్ రాథోడ్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు.

చోటామోటా నాయకులే.. 
ఈ నెల 12వ తేదీన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నేత వెంకటప్రసాద్ సైతం బీజేపీలో చేరేందుకు తన  అనుచరగణంతో రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. అయితే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాత్రం పలు కారణాలతో తిరస్కరించారు. దీంతో వారంతా తీవ్ర నిరాశకు గురై వెనుదిరిగారు. అయితే ఆ తర్వాత మళ్లీ చేరారని పార్టీ నేతలు పై చెబుతున్నా.. అధికారంగా ఎలాంటి సమాచారం విడుదల చేయలేదు. ఇక అమిత్ షా పర్యటన తర్వాత పెద్ద స్థాయిలో వలసలు ఉంటాయని ఆ పార్టీ నేతలు పేర్కొన్నప్పటికీ అలాంటి పరిస్థితి మాత్రం కనిపించడంలేదనే చెప్పొచ్చు. అడపాదడపా నియోజకవర్గ, మండల స్థాయిలో నేతలు మాత్రం వస్తున్నారు. కానీ రాష్ట్ర స్థాయిలో ప్రభావితం చేయగలిగే నేతలు మాత్రం బీజేపీలో రావడంలేదు.

Tags
English Title
BJP is averse to joining celebrities




Related News