పెద్ద మేస్త్రీలా పన్జేస్త!

Updated By ManamThu, 06/14/2018 - 00:37
hareesh rao
  • భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు

  • జిల్లా ప్రాజెక్టుల పనులు త్వరగా పూర్తి చేయాలి.. తుమ్మిళ్ల నుంచి ఆర్డీఎస్ ఆయకట్టుకు నీరివ్వాలి

  • అలసత్వం వహించే గుత్తేదారులపై కఠిన చర్యలు.. పాలమూరు జిల్లా ప్రాజెక్టుల సమీక్షలో మంత్రి

hareesh raoహైదరాబాద్: తెలంగాణలో తాము సంకల్పించ తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టుల పనులు పూర్తయ్యే వరకు మంత్రిలా కాకుండా, పెద్ద మెస్త్రీలా పని చేస్తానని మంత్రి హరీష్ రావు చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో ఎక్కడ, ఏ సమస్య వచ్చినా, తన దృష్టికి తేవాలని అన్నారు. బుధవారం జలసౌధలో మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి,  బీమా, కోయిల్ సాగర్, తుమ్మిళ్ల, నెట్టెంపాడు ప్రాజెక్టు పనులపై సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మహబూబ్ నగర్ జిల్లా ఇంజనీర్లు, గుత్తేదార్లు హాజరయ్యారు. సమస్య ఉన్న చోట జిల్లా కలెక్టర్లు, ఎస్. డీ.సీలు, ప్రాజెక్టు ఇంజనీర్లు కలిసి భూసేకరణలో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. ప్రతీ రోజు పని తీరును మదింపు చేసుకుని...లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలని సూచించారు. బీమా ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేసి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించారు. ఈ సీజన్‌లో బీమా ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని ప్యాకేజీ పనులు ఎట్టి పరిస్థితుల్లోను పూర్తి చేయాల్సిందేనన్నారు. కోయిల్ సాగర్ ప్రాజెక్టు పరిధిలో ప్యాకేజీ  13, 14 పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ప్యాకెజీ 13 లో భూసేకరణ జరిగిన చోట గుత్తెదారులు పనులు చేయడం లేదన్న అంశాన్ని ఇంజనీర్లు మంత్రి దృష్టికి తేగా, వెంటనే పనులు ప్రారంభించాలన్నారు.  మిగిలిన భూసేకరణకు కలెక్టర్లు, ఎస్. డీ.సీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాట చేసుకుని  పూర్తి చేయాలన్నారు. తుమ్మిళ్ల ప్రాజెక్టు పనులన్నీ పూర్తి చేసి ఆగష్టు 15 లోగా ఆర్డీఎస్ ఆయకట్టుకు నీరు ఇవ్వాలని మంత్రి ఆదేశించారు.  కార్మికుల సంఖ్యను పెంచాలని ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. పంపులు, మోటార్లు చైనా నుంచి రావాల్సి ఉందని వారు చెప్పడంతో వాటిని ఎయిర్ కార్గో ద్వారా తెప్పించి సమయాన్ని ఆదా చేయాలని సూచించారు. లిఫట్స్ సలహాదారు పెంటా రెడ్డితో  మహబూబ్ నగర్ ప్రాజెక్టు లిఫ్ట్ లలో కొత్తగా అపాయింట్ అయిన ఎలక్ట్రికల్ ఇంజనీర్లకు ఒక రోజు శిక్షణ ఇప్పించాలని జిల్లా చీఫ్ ఇంజనీర్ ఖగేందర్ ను ఆదేశించారు. కల్వకుర్తి ప్రాజెక్టు పనులపై సమీక్ష చేసిన మంత్రి హరీష్ రావు అనుకున్న సమయంలోగా పనులు పూర్తి చేయాలన్నారు. సున్నా నుంచి 90 కిలోమీటర్ల ప్రధాన కాలువ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. 90 నుంచి 130 కిలోమీటర్ల ప్రధాన కాలువ లో నిర్మాణాలు పూర్తి కాకున్నా...నీరిచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.  ప్రాజెక్టు పనులు నిర్వహిస్తోన్న ఎజెన్సీలు పని చేయకపోతే కఠిన  చర్యలు తప్పవని హెచ్చరించారు.  మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టులపై రెండు రోజుల పాటు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తానని.. ఈ నెలాఖరులోగా వస్తానని చెప్పారు.

English Title
Big pants!




Related News