సీఎల్పీ నాయకుడిగా భట్టి విక్రమార్క?

Bhatti Vikramarka
  • 16 న ఎన్నిక.. పరిశీలకుడిగా వేణుగోపాల్

హైదరాబాద్: కొత్త శాసనసభ సమావేశాలు ఈ నెల 17 నుంచి మొదలుకా నున్నందున సీఎల్పీ నాయకుడి ఎంపికపై ఎఐసీసీ దృష్టి సారించింది. సమర్థుడైన నాయకుడిని ఎన్ను కోవడం ద్వారా సభలో తమ సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ ప్రజా సమస్యలను సభాముఖంగా వినిపించాలని పార్టీ భావిస్తోంది. ఆ దిశలో ప్రభుత్వాన్ని నిలదీసే నేత కోసం పార్టీ కసరత్తు చేస్తోంది. ఎన్నికల్లో పార్టీ తరపున 19 ఎమ్మెల్యేలు గెలిచారు. సీఎల్పీ నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు. టీపీసీసీ చీఫ్ ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, గతంలో డిప్యూటి స్పీకర్, చీఫ్ విప్‌గా పని చేసిన సీనియర్ సభ్యుడు మల్లు భట్టి విక్రమార్క, సీనియర్ సభ్యులు సబితా ఇంద్రారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ పదవికై పోటీ పడుతున్నారు. ప్రధానంగా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే సత్తా ఉన్ననేతను ఎన్నుకోవాలని పార్టీ  భావిస్తోంది. ఆ దిశలో ఎవరైతే బాగుంటుందో కూడా ఆరా తీస్తోంది.  శాసనసభ సమావేశాలకు రెండు రోజులు ముందు  అంటే 16 న సీఎల్పీ సమావేశం నిర్వహించి నేతను ఎన్నుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఎఐసీసీ పరిశీలకుడిగా సీనియర్ నేత కేసి వేణుగోపాల్ హాజరవుతున్నారు. ఆయన సమక్షం లో సీఎల్పీ సమావేశం జరుగుతుంది. తనకు 12 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున తానే సీఎల్పీ నేతగా ఎన్నికవుతానన్న ధీమాతో రాజ గోపాల్ రెడ్డి ఉన్నారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి కూడా ఈ పదవిని ఆశిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు త్వరలో జరగనున్న దృష్ట్యా ఆయన్ను నియమించేందుకు పార్టీ సుముఖంగా లేనట్లు సమాచారం. దాంతో ఆయన బరిలోనుంచి దాదాపు తప్పుకున్నట్లే. ఇక మిగిలింది భట్టి విక్రమార్క, సబితా ఇంద్రారెడ్డి, శ్రీధర్ బాబు. భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు తమలో ఎవరికి సీఎల్పీ పదవి వరించినా అభ్యంతరం లేదనే అవగాహనకు వచ్చి నట్లు తెలిసింది. ఇద్దరిలో ఎవరో ఒకరికి సీఎల్పీ పదవి వరిస్తే మిగతా సభ్యుడిని ఉప నాయకుడిగా ఎన్నుకునే అవకాశాలు ఎక్కువగా కనిపి స్తున్నాయి. పీసీసీ చీఫ్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినందున సీఎల్పీ నాయకుడిగా రెడ్డియేతర ఎమ్మెల్యేను ఎన్నుకోవాలని పార్టీ సంకేతాలు పంపిం చినట్లు తెలిసింది.  అదే నిజమైతే మల్లు భట్టి విక్రమార్కను సీఎల్పీ పదవి వరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయనకు కీలకమైన బాధ్యతలు అప్పగించడం ద్వారా షెడ్యూల్డ్ కులాలకు చెందిన వ్యక్తికి ప్రాధాన్యత ఇచ్చిన సంకేతాలు ప్రజల్లోకి వెళతాయని, దానివల్ల పార్టీ పట్ల దళిత, బహుజనుల్లో సానుకూలత ఏర్పడవచ్చని పార్టీ భావిస్తోంది. టీఆర్‌ఎస్ పార్టీ దళిత సీఎంను ప్రకటించి మోసం చేసిందని, తాము మాత్రం దళితుడిని సీఎల్పీ నేతగా ఎన్నుకున్నామనే క్రెడిట్ దక్కించుకునేందుకు కూడా భట్టి విక్రమార్క అభ్యర్థిత్వం వైపు పార్టీ మొగ్గు చూపుతోందని తెలిసింది.

సంబంధిత వార్తలు