ఫైనల్లో బెల్జియం X నెదర్లాండ్స్

Men's Hockey World Cup
  • పురుషుల హాకీ వరల్డ్‌కప్

భువనేశ్వర్: పురుషుల హాకీ వరల్డ్‌కప్‌లో భాగంగా శనివారం జరిగిన తొలి సెమీస్ మ్యాచ్‌లో బెల్జియం జట్టు 6-0తో ఇంగ్లాండ్ జట్టుపై విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఒలింపిక్‌లో రజత పతకం గెలిచిన బెల్జియం జట్టు హాకీ వరల్డ్‌కప్‌లో తొలిసారి ఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించింది. ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్‌లో బెల్జియం ఆటగాళ్లు రెట్టించిన ఉత్సాహంతో ఆడారు. బెల్జియం ఆటగాడు అలెగ్జాండర్ హెండ్రిక్స్ (45, 50వ నిమిషం)లో రెండో గోల్స్‌తో పాటు, టామ్ బూన్ (8వ నిమిషం), సిమాన్ గౌగ్‌నార్డ్ (19వ నిమిషం), సిడ్రిక్ చార్లియర్ (42వ నిమిషం), సెబాస్టియన్ (53వ నిమిషం)లో గోల్స్ చేయటంతో ఇంగ్లాండ్‌పై 6-0తో ఘనవిజయం సాధించింది. మరో సెమీస్‌లో ఆస్ట్రేలియాపై 3-4తో నెదర్లాండ్స్ షూటౌట్‌లో గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. నేడు జరగబోయే ఫైనల్ మ్యాచ్‌లో బెల్జియంతో నెదర్లాండ్స్ తలపడనుంది. 

ఫైనల్ మ్యాచ్‌కు రానున్న సచిన్
దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో ఆదివారం జరగబోయే ఫైనల్ మ్యాచ్‌కు హాజరుకానున్నట్లు స్వయంగా తన ట్విటర్ ద్వారా తెలిపారు. ‘ హాకీ వరల్డ్‌కప్‌ను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నందుకు ఒరిస్సా ముఖ్యమంత్రికి, హాకీ ఇండియాకు ముందుగా నా శుభాకాంక్షలు. ఆదివారం జరగబోయే ఫైనల్ మ్యాచ్ చూడటానికి నేను కళింగ స్టేడియంకు రానున్నాను. మిమ్మల్ని అక్కడ కలుస్తా’ అని సచిన్ తన ట్విటర్‌లో పేర్కొన్నారు. టెండూల్కర్ ట్విటర్‌కు స్పందించిన ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ‘హాకీకు మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు. మీ రాక కోసం ఒరిస్సా, హాకీ అభిమానులు ఎదురుచూస్తున్నారు’ అని పట్నాయక్ తన ట్విటర్‌లో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు