బ్యాంక్ ఆఫ్ బరోడాకు నష్టాలు

Updated By ManamSun, 05/27/2018 - 00:49
baroda
  • బ్యాంక్ ఆఫ్ బరోడా క్యూ 4 నష్టం రూ. 3,102 కోట్లు

bobముంబయి: బ్యాంక్ ఆఫ్ బరోడా 2018 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికానికి రూ. 3,102 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. 2016-17లో అదే కాలంలో బ్యాంక్ రూ. 154 కోట్ల లాభాన్ని చూపగలిగింది. నికర లాభంలో 60 శాతం తగ్గుదలతో క్యూ 4లో బ్యాంక్ దాదాపు రూ. 60 కోట్ల లాభం చూపించగలదని అంచనా వేసిన విశ్లేషకులను ఈ ఫలితాలు అసంతృప్తికి గురి చేశాయి. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం మాత్రం క్యూ 4లో 12 శాతం వృద్ధి చెంది రూ. 4,002 కోట్లుగా నమోైదెంది. 2017 డిసెంబర్ అంతానికి మొత్తం రుణాల్లో 11.34 శాతంగా ఉన్న స్థూల ఎన్.పి.ఏలు మరింతగా 12.26 శాతం పెరిగి ముందు ఊహించిన దానికన్నా చాలా ఎక్కువగా సుమారు రూ. 56,480 కోట్లుగా లెక్క తేలింది. నిరర్థక ఆస్తులకు కేటాయించే మొత్తాలు 2016-17 క్యూ 4లో ఉన్న రూ. 2,425 కోట్ల నుంచి 2017-18 చివరి త్రైమాసికంలో రూ. 7,052 కోట్లకు పెరిగాయి. 2017 ఆర్థిక సంవత్సరానికి రూ. 1,383 కోట్ల లాభాన్ని చూపిన బ్యాంక్ 2018 ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ. 2,432 కోట్ల నష్టాన్ని చూపింది.

బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు శుక్రవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6.10 వరకు సుదీర్ఘ సమావేశం జరిపింది. ఈ ఏడాది బోర్డు డివిడెండ్‌కు సిఫార్సు చేయులేదు. అదనపు మూలధనం రూ. 10,000 కోట్ల సమీకరణకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. దానిలో రూ. 6,000 కోట్లను ఈక్విటీ ద్వారా, రూ. 4,000 కోట్లను టైర్-1/2 సాధనాల ద్వారా సేకరిస్తారు. 2017-18 సంవత్సరం నాల్గవ త్రైమాసికానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు రికార్డు స్థాయిల్లో నష్టాలను ప్రకటిస్తున్నాయి. ఇండియన్ బ్యాంక్, విజయా బ్యాంక్ మినహా 15 ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు క్యూ 4లో నష్టాలు నమోదు చేశాయి. నాల్గవ త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు చూపిన మొత్తం నష్టం రూ. 53,000 కోట్లుగా ఉంది. రెండవ పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ రికార్డు స్థాయిలో రూ. 13,417 కోట్ల నష్టాన్ని నమోదు చేయగా, దేశంలోనే పెద్ద బ్యాంక్ అయిన ఎస్.బి.ఐ క్యూ 4లో రూ. 7,718 కోట్ల నష్టాన్ని ప్రకటించింది.

English Title
Bank of Baroda Losses
Related News