‘నిషేధం’ చట్టవిరుద్ధం!

Updated By ManamSat, 07/21/2018 - 02:30
deepak mishra

కేరళలోని 12వ శతాబ్దం నాటి ప్రసిద్ధ శబరిమలై ఆలయంలోకి మహిళల (అవంధ్య ప్రాయంలో) ప్రవేశంపై ఉన్న imageనిషేధం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమైంది. ప్రైవేట్ ఆలయం కాబట్టి శిష్టాచారాలు, పూజా విధానాలు సంబంధిత ఆలయాల సొంత వ్యవహారమనే కేరళ ప్రభుత్వ వాదనను ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా తప్పుపట్టారు. ‘సొంత ఆలయం అనే భావనంటూ ఏదీ లేదు. బహిరంగ ప్రదేశంలో ఆలయంటూ ఒకటి ఉంటే, అందులోకి అందరికీ ప్రవేశం ఉండితీరాలి. పురుషులు పోగలిగే ఆలయాల్లోకి మహిళలను కూడా తప్పక అనుమతించాలి’ అని సీజేఐ స్పష్ట చేశారు. ఈ తీర్పుతో 10-50 ఏళ్ళ మధ్య మహిళల ప్రవేశంపై నిషేధం విధించిన ప్రఖ్యాత శబరిమలై ఆలయంలో కొనసాగుతున్న లింగ వివక్షపై వేటు పడింది.

‘ప్రతి మహిళ కూడా భగవంతుని సృష్టే. ఉద్యోగ నియామకాల్లో, పూజా విధానంలో వారిపై వివక్ష ఎందుకు కొనసాగాల’ని జస్టిస్ చంద్రచూడ్ ప్రశ్నించారు. బ్రహ్మచారి దేవుడ్ని కొలిచేందుకు అవంధ్య ప్రాయంలోని మహిళలపై నిషేధం విధించడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం ధర్మాసనం తప్పుపట్టంది. వివిధ సామాజిక రంగాల్లో కొన సాగుతున్న లింగ వివక్షను తొలగించే ధోరణిని సుప్రీం ధర్మాసనం ఎత్తి పట్టింది. చాలాకాలంగా విచారణలో ఉన్న శబరిమలై ఆలయ నిషేధం కేసు వాదోపవాదాలు విన్న తర్వాత మహిళా సమానత్వాన్ని రాజ్యాంగ ధర్మాసనం ధ్రువీకరించింది. రాజ్యాంగంలోని 25 (1) అధిరణం ప్రకారం ధర్మాన్ని, మతాన్ని ప్రతిఒక్కరూ అనుసరించే హక్కుందని స్పష్టం చేసింది. 
    
మహారాష్ట్రలోని
హాజీ అలీ దర్గాలోకి మహిళల ప్రవేశంపైగల నిషేధం రాజ్యాంగంలోని 14,15,25 అధికరణాల ప్రకారం చట్టవిరుద్ధమని ముంబయి హైకోర్టు గతంలో తీర్పు చెప్పింది. ముంబయి హైకోర్టు తీర్పును ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో సవాలు పిటిషన్ దాఖలైనప్పటికీ, మగవారితో సమానంగా మహిళలను కూడా దర్గాలోకి ప్రవేశించేందుకు అనుమతిస్తామని 2016 అక్టోబర్‌లో దర్గా ట్రస్టు సర్వోన్నత న్యాయ స్థానంలో అంగీకరించక తప్పలేదు. మత విశ్వాసాలు, సామాజిక ఆచారాలు ఆధునిక ప్రజాస్వామిక, సమానత్వ భావనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నప్పుడు ప్రభుత్వాలు, న్యాయస్థానాలు బడుగు, బలహీన వర్గాలకు, అస్తిత్వాలకు అండగా నిలవాల్సి ఉంటుంది. శబరిమల వివాదంలో కేరళ వామపక్ష ప్రభుత్వం కూడా శబరిమలై ఆలయంలోకి మహిళల ప్రవేశానికి అనుకూలతను ప్రకటించింది. 

కేరళలో 2007లో ఎల్‌డీఎఫ్ (లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్) ప్రభుత్వం, 2016 నవంబర్ వామ పక్ష కూటమి ప్రభుత్వాలు మహిళల ప్రవేశాన్ని సమర్థించగా, 2016 ఫిబ్రవరిలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వం ఆలయ నిషేధాన్ని సమర్థించింది. ఈ పరిస్థితి వల్ల ఈ కేసు సుదీర్ఘకాలం పాటు కొనసాగింది. మొదట మహిళల ప్రవేశాన్ని అనుమతించాలని కోరుతూ అభివృద్ధికరమైన వైఖరి చేపట్టిన అధికార సీపీఎం, ఆ తర్వాత రాజకీయ కారణాల రీత్యా వెనుకంజ వేసింది. హాజీ అలీ దర్గా, శబరిమలై ఆల యాల్లో మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు తీర్పు మహిళల ప్రాథమిక హక్కులను, సమానత్వ హక్కును, పూజా కార్యక్రమాల స్వేచ్చా హక్కును మరొకసారి ఎత్తి పట్టింది. ఇలాంటి సున్నితమైన మత, సాంస్కృతిక విషయాలను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకునే రాజ కీయ పక్షాలకు సుప్రీం తీర్పు ఒక హెచ్చరికగా ఉంటుంది. మత సంప్ర దాయాలు రాజ్యాంగ విలువలను తోసిపుచ్చకూడదన్న స్ఫూర్తితో న్యాయ స్థానాలు మహిళా హక్కులను అన్ని రంగాల్లో స్థిరంగా సమర్థిస్తుండడం హర్షణీయం. ‘ఒక జీవ సంబంధిత దృగ్విషయం ఆధారంగా ఎందుకు వివక్ష చూపాలి?’ అని సీజేఐ ప్రశ్నించడం ఆశావహం. పురాణాలు, ఇతి హాసాల్లో కుల, లింగ వివ క్షతో కూడిన ఆచారాలను, సంప్రదాయాలను రాసి ఉన్నప్పటికీ, వాటిని ఆధునిక సమాజంలో పాటించడం చట్ట విరుద్ధమనే సందేశం అన్ని మతాధిపత్యాలకు ఒక హెచ్చరికలాంటిది. 

ఉమ్మడి ప్రజా రహదారులు, పాఠశాలల మాదిరిగానే బహిరంగ ప్రజా దేవాలయాలు కూడా ప్రజలందరి ఉమ్మడి వినియోగానికి అవకాశం ఉండాలని బిఆర్ అంబేడ్కర్ సూచనల ప్రాతిపదికన సీజేఐ తన అభి ప్రాయాలను వ్యక్తంచేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25(1)లో పొందు పరచిన మత సంస్థ హక్కు, ఎట్టి పరిస్థితుల్లోనూ అదే రాజ్యాంగంలోని ఆర్టికల్ 25(1)లోని మహిళల మత స్వేచ్ఛను కాలరాయడం సరికాదు. సార్వత్రిక విద్యలో దేశంలోనే తలమానికంగా ఉన్న కేరళ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కారణాల రీత్యా మహిళల పవిత్రత వంటి అశాస్త్రీయ మూఢ విశ్వాసాలను సమర్థించడం దురదృష్టకరం. వాస్తవంలో, చాలామంది మహిళలు కూడా ఈ మూఢ నమ్మకాన్ని బలంగా విశ్వసిస్తున్నప్పటికీ, రాజ్యాంగ విరుద్ధంగా అమలవుతున్న మహళల ఆలయ ప్రవేశ నిషేధ సంప్రదాయంపై సుప్రీంకోర్టు తీర్పు ఆధునిక సామాజిక విలువల వ్యాప్తికి దోహదం చేస్తుంది. 

Parvathi

 

- వై. ఉమా పార్వతి
జర్నలిస్ట్
9100074712

English Title
'Ban' is illegal!
Related News