ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు బుమ్రా దూరం

Mohammad Siraj

సిడ్నీ: టెస్టు సిరీస్‌లో సరికొత్త చరిత్ర లిఖించిన కోహ్లీ సేన ఇక ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లకు సిద్ధమవుతోంది. ఈ సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు తదుపరి మ్యాచ్‌ల్లో బీసీసీఐ విశ్రాంతి కల్పించింది. ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే మ్యాచ్‌లు, న్యూజిలాండ్ పర్యటనలో బుమ్రా ఆడట్లేదని ప్రకటించింది. అతడి స్థానంలో హైదరాబాద్ కుర్రాడు మహ్మద్ సిరాజ్‌కు అవకాశం కల్పించింది. ‘తర్వాతి సిరీస్‌లను దృ ష్టిలో పెట్టుకుని ప్రస్తుతం బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడమే మంచిదని భావించాం. ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచ్‌లు, న్యూజిలాండ్ పర్యటనలో బుమ్రా స్థానంలో మహ్మద్ సిరాజ్ ఆడుతాడు’ అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. తాజా టెస్టుల్లో బుమ్రా అద్భుత ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. కేవలం 12 నెలల క్రితమే టెస్టుల్లో అరంగేట్రం చేసిన బుమ్రా.. ప్రస్తుతం కీలక పేసర్‌గా మారిపోయాడు. ఆసీస్‌తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌లో 21 వికెట్లు తీయడం విశేషం. జనవరి 12 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ అనంతరం ఐదు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు టీమిండియా న్యూజిలాండ్ బయల్దేరుతుంది. జనవరి 23 నుంచి న్యూజిల్యాండ్ సిరీస్ ప్రారంభం కానుంది.

సంబంధిత వార్తలు