బట్టతల గాయబ్!

Updated By ManamSun, 05/13/2018 - 01:35
head
  • తల మీద మొలకలకు కొత్త మందు.. ఇప్పటికే మార్కెట్లో రెండు మందులు

  • వాటితో లెక్కలేనన్ని దుష్ప్రభావాలు.

  • అవాంఛిత రోమాల పెరుగుదల కూడా

  • ఆస్టియోపొరాసిస్ మందుతో ఉపయోగం

  • తలమీద జుట్టు పెరుగుదలకూ సాయం

  • దుష్ర్పభావాలు లేకుండానే సత్ఫలితాలు 

  • గుర్తించిన మాంచెస్టర్ వర్సిటీ పరిశోధకులు

headబట్టతల ఉన్న ఓ వ్యక్తి మధ్యాహ్న సమయంలో ఎండ ఎక్కువగా ఉందని, సూర్య ప్రతాపం నుంచి తప్పించుకోడానికి నీడ కోసం తాటిచెట్టు కిందకు వెళ్లాడట. అప్పుడే దురదృష్టవశాత్తు ఓ తాటిపండు రాలి అతడి తలమీద పడి తల బద్దలైంది. దైవబలం తక్కువగా ఉన్నవాడు ఎక్కడికి వెళ్తే.. ఆపదలు అక్కడికే వెళ్తాయి.. ఇది ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి శతకంలోని పద్యం. నిజంగానే బట్టతల ఉన్నవాళ్ల బాధలు చెప్పనలవి కావు. ఎదురుపడిన ప్రతివాళ్లూ అదోలా చూసి వె టకారంగా నవ్వుతారు.. పెళ్లి చూపుల దగ్గరనుంచి అన్నింటిలోనూ ఇబ్బందే. పెళ్లి కాకముందే బట్టతల ఉంటే సంబంధాలు కుదరడం చాలా కష్టం. ఒకవేళ పెళ్లయిన తర్వాత వస్తే.. భార్యామణి విసుర్లు తట్టుకోవడం అంతకంటే కష్టం. ఈ బాధలన్నింటి నుంచి శాశ్వతంగా విముక్తి కల్పించే మార్గం ఒకటొచ్చింది. ఇన్నాళ్లూ విగ్గులతోనో.. హెయిర్ వీవింగ్‌తోనో ఇబ్బందులు పడ్డ వాళ్లకు ఇది నిజంగానే వరం. సాధారణంగా ఎముకలు పెళుసుబారే వ్యాధి (ఆస్టియోపొరాసిస్)ను నయం చేయడానికి ఉపయోగించే ఒక మందు వాడినపుడు.. బట్టతల కూడా తగ్గుతూ, కొత్తగా జుట్టు మొలుస్తోందని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ఈ మందును ఇంకా మనుషుల మీద ప్రయోగించి ఫలితాలు చూడాల్సి ఉంది గానీ, ఇందులో ప్రధానంగా ఉపయో గిస్తున్న డబ్ల్యుఏవై-316606 అనే పదార్థం.. జుట్టు పెరుగుదలను అడ్డుకునే ప్రోటీన్ మీద పనిచేసి, కొత్తగా జుట్టు పెరిగేందుకు ఉపయోగపడుతోందట. అసలు దీన్ని మొదట్లో జుట్టు పెరగడం గురించి ఏమాత్రం పరిశీలించలేదు. కానీ అనుకోకుండా ఈ మందు వాడినపుడు జుట్టు పెరగడంతో, ఏం జరుగుతోందా అని ప్రత్యేకంగా పరీక్షించినపుడు ఈ విషయాలు కూడా తెలిశాయని యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్‌కు చెందిన డాక్టర్ నాథన్ హాక్‌షా తెలిపారు. ఆయనే ఈ ప్రయోగానికి ప్రధాన శాస్త్రవేత్తగా ఉన్నారు. ప్రస్తుతం పురుషులలో బట్టతలను నివారించడానికి మినోక్సిడిల్, ఫినాస్టెరైడ్ అనే రెండు రకాల మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కానీ వాటివల్ల దుష్ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయి. ఫలితాలు కూడా అంతంతమాత్రంగానే కనిపిస్తున్నాయి. లేదంటే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ లేదా హెయిర్ వీవింగ్‌కు వెళ్లాలి. సాధారణంగా ట్రాన్స్‌ప్లాంటేషన్ సమయంలో సైక్లోస్పోరిన్ ఎ అనే ఔషధాన్నా ఉపయోగిస్తారు. అది ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను శరీరం అడ్డుకోకుండా చూడటంతో పాటు, ఆటో ఇమ్యూన్ సమస్యనూ పరిష్కరిస్తుంది. అయితే, దీనివల్ల కూడా చాలా తీవ్రస్థాయిలో దుష్ప్రభావాలు తలెత్తుతాయి. అవాంఛిత రోమాలు కూడా చాలా ఎక్కువగా పెరుగుతాయని చెబుతున్నారు. ఇప్పుడు ఇలాంటి బాధలు ఏమీ లేకుండా ఆస్టియోపొరాసిస్ నివారణకు ఉపయోగించే మందుతో బట్టతల తగ్గుతోందని తెలియడంతో దీనిపై కూడా పరిశోధనలు మొదలయ్యాయి. మాంచెస్టర్ బృందం దీనిమీద ప్రయోగాలు, పరిశోధనలు మొదలుపెట్టింది. ప్రయోగాలలో భాగంగా హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ కోసం సిద్ధమైన 40 మంది పేషెంట్లను తీసుకుని, వారికి ఆరు రోజుల పాటు ఆస్టియోపొరాసిస్ మందు ఇచ్చారు. వారికి వెంటనే చిన్న చిన్నగా జుట్టు రావడం మొదలైంది. రెండు రోజుల తర్వాత జుట్టు ఎదుగుదలను కొలిచి చూస్తే.. ఫలితాలు చాలా ఆశాజనకంగా కనిపించాయి. తొలుత ఎలుకల మీద ఈ మందు ప్రయోగించి చూసినపుడు చాలా విభిన్నమైన ఫలితాలు వచ్చాయని, కేవలం దానిమీదే ఆధారపడి ఉంటే ఎన్నటికీ ఈ దిశగా అడుగులు పడేవి కావని డాక్టర్ హాక్‌షా తెలిపారు. ఆయనతో పాటు ప్రొఫెసర్ రాల్ఫ్ పాస్ బృందం కూడా ఈ ఔషధాన్ని పరిశీలించింది. సైక్లోస్పోరిన్ ఎ వాడినపుడు ప్రధానంగా జుట్టుకు సంబంధించిన గ్రంధులు సహా అనేక కణజాలాల ఎదుగుదలను అడ్డుకుంటుంది. అంతేకాక.. ఎక్కడ జుట్టు ఎక్కువగా పెరగాలో, ఎక్కడ తక్కువగా పెరగాలో నిర్ణయించే వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. దానివల్ల అవాంఛిత రోమాలు ఎక్కువగా పెరుగుతాయి. ఈ నష్టాలన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న తర్వాతే డబ్ల్యుఏవై-316606 ఔషధాన్ని రూపొందించారు. దీన్ని వాడటం వల్ల సైక్లోస్పోరిన్ ఎ వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏమీ లేకుండానే బట్టతల మీద జుట్టు పెరగడం మాత్రం కనిపించింది. ఈ పరిశోధనలో తమకు స్థానిక హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ అసీమ్ షామాలక్ ఎంతో సాయం చేశారని డాక్టర్ హాక్‌షా తెలిపారు. బట్టతల ఉన్న 40 మంది ఈ కొత్త చికిత్సకు అంగీకరించేలా చేసింది ఆయనే. ఏదో ఒకనాటికి ఈ కొత్త మందు వల్ల బట్టతల సమస్య నుంచి పూర్తిగా విముక్తి దొరికే అవకాశముందని ఆయన ఆశాభవం వ్యక్తం చేశారు. ఈ మందు ప్రయోగాల దశను దాటి మార్కెట్లోకి ప్రవేశించి.. భారతదేశానికి కూడా వస్తే.. అపుడు ఇక బట్టతల అన్న సమస్యే దేశంలో కనిపించకపోవచ్చు. అపుడు పెళ్లిళ్లు కావనే అతిపెద్ద సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుంది. 
- మనం - సెంట్రల్ డెస్క్

Tags
English Title
Bald gav!
Related News