భారీ ఆధిక్యం దిశగా ఆసీస్ 

aussies
  • తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 283 ఆలౌట్

  • విరాట్ కోహ్లీ సెంచరీ

పెర్త్: భారత్, ఆస్ట్రేలియా రెండో టెస్టు ఫలితం దిశగా సాగుతున్నట్టే కనిపిస్తోంది. మ్యాచ్‌పై ఆతిథ్య జట్టే ఆధిపత్యం కొనసాగిస్తోంది. పేసర్లు కట్టుదిట్టంగా బంతులు వేస్తున్నా ప్రధాన స్పిన్నర్ లేని లోటు టీమిండియాను వేధిస్తోంది. కీలక సమయాల్లో వికెట్లు పడటం లేదు. తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ సేన 283 పరుగులకే ఆలౌటైంది. మూడోరోజు, ఆదివారం ఆట ముగిసే సరికి కంగారూ జట్టు 4 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. ఆధిక్యంతో కలుపుకొని 175 పరుగులతో ఉంది. ఆసీస్ 200 కన్నా ఎక్కువ లక్ష్యం నిర్దేశిస్తే కోహ్లీ సేనకు చాలా కష్టం. రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా నిలకడగా రాణిస్తూనే పరుగులు రాబడుతోంది. అనుకున్నట్లుగానే పెర్త్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా పట్టు బిగించింది. ఆటలో మూడో రోజైన ఆదివారం ఓవర్‌నైట్ స్కోరు 172/3తో తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన టీమిండియా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ (123: 257 బంతుల్లో 13ఫోర్లు, 1సిక్సు) సెంచరీ బాదినా.. మిగిలిన టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్, టెయిలెండర్లు నిరాశపరచడంతో 283 పరుగులకి ఆలౌటైంది. దీంతో.. 43 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకున్న ఆస్ట్రేలియా జట్టు ఆదివారం ఆట ముగిసే సమయానికి 132/4తో నిలిచింది. క్రీజులో ఉస్మాన్ ఖ్వాజా (41 బ్యాటింగ్: 102 బంతుల్లో 5ఫోర్లు), కెప్టెన్ టిమ్‌పైన్ (8 బ్యాటింగ్: 26 బంతుల్లో 1ఫోర్) ఉండగా.. 175 పరుగుల ఆధిక్యంలో ఆస్ట్రేలియా కొనసాగుతోంది. కాబట్టి.. సోమవారం తొలి సెషన్‌లో భారత్ బౌలర్లు రాణించడంపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ హారిస్ (20: 56 బంతుల్లో 2ఫోర్లు) తక్కువ స్కోరుకే బుమ్రా బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డవగా.. మరో ఓపెనర్ అరోన్ ఫించ్ (25 రిటైర్డ్ హర్ట్: 30 బంతుల్లో 5ఫోర్లు) చేతి వేలు గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన షాన్ మార్ష్ (5: 11 బంతుల్లో 1ఫోర్), ట్రావిస్ హెడ్ (19: 49 బంతుల్లో 2ఫోర్లు)లను మహ్మద్ షమీ బోల్తా కొట్టించగా.. మధ్యలో హ్యాండ్స్‌కబ్ (13: 14 బంతుల్లో 3ఫోర్లు) దూకుడుగా ఆడే ప్రయత్నంలో ఇషాంత్ శర్మకి వికెట్ల ముందు ఎల్బీడబ్ల్యూగా దొరికిపోయాడు. తొలి సెషన్ ఆరంభ ఓవర్‌లోనే భారత్‌కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియన్ బౌలింగ్‌లో బంతిని డిఫెన్స్ చేసేందుకు రహానే (51: 105 బంతుల్లో 6ఫోర్లు, 1సిక్సు) ప్రయత్నించగా.. బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి నేరుగా కీపర్ టిమ్‌పైన్ చేతుల్లోకి వెళ్లిపోయింది. జట్టు స్కోరు 173 వద్దే భారత్ 4వ వికెట్ చేజార్చుకుంది. ఆ తర్వాత వచ్చిన తెలుగు క్రికెటర్ హనుమ విహారి (20: 46 బంతుల్లో 2ఫోర్లు) కాసేపు క్రీజులో నిలిచినా.. జట్టు స్కోరు 233 వద్ద అతనూ ఔటైపోయాడు. హజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఆఫ్ స్టంప్‌కి వెలుపల పడిన బంతిని వెంటాడి కీపర్ టిమ్‌పైన్ చేతికి అతను చిక్కాడు. ఈ దశలో కాసేపు దూకుడుగా ఆడిన విరాట్ కోహ్లీ 251 వద్ద అంపైర్ వివాదాస్పద నిర్ణయం కారణంగా ఔటవడంతో.. భారత్ జట్టు మళ్లీ ఒత్తిడిలో పడింది. ఒక ఎండ్‌లో రిషబ్ పంత్ (36: 50 బంతుల్లో 2ఫోర్లు, 1సిక్సు) క్రీజులో నిలిచినా.. మహ్మద్ షమీ (0), ఇషాంత్ శర్మ (1), ఉమేశ్ యాదవ్ (4 నాటౌట్), జస్‌ప్రీత్ బుమ్రా (4) తేలిపోయారు.

సచిన్ తర్వాత కోహ్లీనే...
ఆస్ట్రేలియా గడ్డపై శతకం సాధించిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డుల్లో నిలిచాడు. పెర్త్ వేదికగా ఆసీస్‌తో తాజాగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో మూడో రోజైన ఆదివారం శతకం సాధించిన విరాట్ కోహ్లీ (123: 257) దిగ్గజ క్రికెటర్ సచిన్ సరసన నిలిచాడు. 1992 తర్వాత పెర్త్‌లో ఓ భారత క్రికెటర్ సెంచరీ సాధించడం ఇదే తొలిసారి.  ఆస్ట్రేలియా గడ్డపైకి 26ఏళ్ల క్రితం 18ఏళ్ల వయసులో పర్యటనకి వెళ్లిన సచిన్ టెండూల్కర్.. పెర్త్ వేదికగా జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో 161 బంతుల్లో 114 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు 346 పరుగులు చేయగా.. సచిన్ ధీటుగా బదులిచ్చాడు. అయితే.. సచిన్ మినహా అందరూ విఫలమవడంతో భారత్ జట్టుకి ఓటమి తప్పలేదు. ఆ తర్వాత ఇన్నేళ్లకి మళ్లీ పెర్త్‌లో విరాట్ కోహ్లీ రూపంలో భారత బ్యాట్స్‌మెన్ శతకం సాధించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో 25 శతకాల మార్క్‌ని బ్రాడ్‌మాన్ 68 ఇన్నింగ్స్‌ల్లో అందుకుని అగ్రస్థానంలో ఉండగా.. అతని తర్వాత విరాట్ కోహ్లీ నిలిచాడు. కోహ్లీ 127 ఇన్నింగ్స్‌లో ఆ మైలురాయిని చేరుకోగా.. సచిన్ 130 ఇన్నింగ్స్‌లతో మూడో స్థానానికి పరిమితమయ్యాడు. ఇక ఆస్ట్రేలియా అత్యధిక శతకాలు బాదిన భారత క్రికెటర్ల జాబితాలో.. సచిన్ 11 శతకాలతో నెం.1 స్థానంలో ఉండగా ఆ తర్వాత సునీల్ గవాస్కర్ (7), విరాట్ కోహ్లీ (7) వరుసగా రెండు మూడు స్థానాల్లో నిలిచారు.

Tags

సంబంధిత వార్తలు