అటల్‌జీని కుంగదీసిన 2004 ఓటమి

Updated By ManamFri, 08/17/2018 - 08:45
Vajpayee

Vajpayeeన్యూఢిల్లీ:  దేశ రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించిన రాజకీయ దురందరుడు అటల్ బిహారీ వాజ్‌పేయి దివికేగారు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం అందిస్తోంది మనం. అటల్‌జీ జీవితంలో బాధపడ్డ ఒకే ఒక్క సందర్భం ఏదైనా ఉందా అంటే అది 2004 ఎన్నికల్లో ఓటమేనని చెప్పుకోవచ్చు. గెలుస్తామన్న గట్టి నమ్మకంతో ఆరు నెలలు ముందుగా వాజ్‌పేయి ఎన్నికలకు వెళ్లారు. అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే ఈ పరాజయానికి కర్త, కర్మ, క్రియ తానేనంటూ ఓటమి బాధ్యత తనదేనని ప్రకటించిన ఏకైక నాయకుడు ఇతడే. అంతేకాదు.. అప్పట్లో లోక్‌సభలో ప్రతిపక్షనేతగా కూడా ఉండేందుకు అటల్ జీ ఏ మాత్రం ఇష్టపడక తిరస్కరించేశారు. తర్వాతి సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయనని సంచలన ప్రకటన చేశారు. ఈ సమావేశంలో వాజపేయి ‘ఇకనుంచి లాల్ కృష్ణ అద్వానీ, ప్రమోద్ మహాజన్‌లు భారతీయ జనతా పార్టీకి రామలక్ష్మణుల వంటివారు' అని ప్రకటించారు. అప్పట్నుంచి బీజేపీ పార్టీ పగ్గాలు పూర్తిగా మాజీ ప్రధాని, బీజేపీ అగ్రనేత అద్వానీ చూసుకుంటూ వచ్చారు. 2005లో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. అయితే 2005 నుంచి ఏనాడూ ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భాలు దాదాపూ లేవనే చెప్పుకోవచ్చు. ఇందుకున్న కారణాల్లో అనారోగ్య సమస్యలు కూడా ప్రధానమైనవే.

2009లో వాజ్‌‌పేయికి గుండెపోటు రావడంతో స్టంట్ అమర్చి విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. అప్పట్నుంచి ఆయన ఇంటికే పరిమితమై రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. ఆఖరికి 2015లో అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ కూడా అనారోగ్యంతో ఉన్న సమయంలోనే అందుకున్నారు. అనారోగ్యంతో మంచానికే పరిమితమైన అటల్‌జీకి భారతరత్నను బహుకరించడానికి స్వయంగా రాష్ట్రపతే ఆయన స్వగృహానికి వెళ్లడం విశేషం. ఆ తర్వాత ఆయన ఒకట్రెండు సార్లు ఆరోగ్యపరిస్థితి విషమించడం.. అటల్ జీ ఇక లేరని పెద్ద ఎత్తున వార్తలు రావడం కూడా అప్పట్లో కలకలం రేపాయి. అలా కొన్నేళ్లపాటు ఆయన ఇంట్లోనే చికిత్స పొందుతూ వచ్చారు. అయితే అటల్‌జీ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరిలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే గురువారం అనగా పంద్రాగస్టు మరుసటి రోజు సాయంత్రం తుదిశ్వాస విడిచారు.

English Title
Atal Bihari Vajpayee felt sad about 2004 elections
Related News