ఏడుగురు సైనిక సిబ్బందికి జీవితఖైదు

Updated By ManamMon, 10/15/2018 - 16:42
Assam Fake Encounter: Seven Army Men Sentenced to Life Imprisonment in 24 Year Old
  • అసోంలో బూటకపు ఎన్ కౌంటర్

  • 24 ఏళ్ల నాటి ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు సైనిక సిబ్బందికి జీవిత ఖైదు

Fake Encounter

డిబ్రుగఢ్ : అసోంలోని తీన్‌సుకియా జిల్లాలో ఎప్పుడో 1994లో జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో ఒక మేజర్ జనరల్ సహా మొత్తం ఏడుగురు సైనిక సిబ్బందికి ఆర్మీ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 24 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించి విచారణ జరిపిన సమ్మరీ జనరల్ కోర్ట్ మార్షల్... మేజర్ జనరల్ ఏకే లాల్, కల్నల్ థామస్ మాథ్యూ, కల్నల్ ఆర్‌ఎస్ సిబిరెన్, కెప్టెన్ దిలీప్ సింగ్, కెప్టెన్ జగ్‌దేవ్ సింగ్, నాయక్ అల్బీందర్ సింగ్, నాయక్ శివేందర్ సింగ్‌లకు జీవితఖైదు శిక్ష విధించింది. 

ఒక టీ తోట ఉన్నతోద్యోగి హత్య కేసులో సంబంధం ఉందన్న అనుమానంతో 1994 ఫిబ్రవరి 18న తీన్‌సుకియా జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల నుంచి ఆర్మీ 9 మందిని పట్టుకుందని అసోం మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు జగదీష్ భుయాన్ తెలిపారు. వారిలో ఐదుగురు యువకులను సైనికులు బూటకపు ఎన్‌కౌంటర్‌లో చంపేసి, వారంతా ఉల్ఫా తీవ్రవాదులుగా ముద్ర వేశారన్నారు. మిగిలిన నలుగురినీ విడిచిపెట్టారు. అదే సంవత్సరం ఫిబ్రవరి 22న జగదీష్ భుయాన్ మరణించిన ఐదుగురి ఆచూకీ కోసం గువాహతి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. 

దాంతో ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (ఆసు)కు చెందిన తొమ్మిది మంది విద్యార్థి నేతలను సమీప పోలీసు స్టేషన్‌లో చూపించాలని భారత సైన్యాన్ని హైకోర్టు ఆదేశించింది. దాంతో, ఆర్మీ వర్గాలు ఐదుగురి మృతదేహాలను ఢోలా పోలీసు స్టేషన్‌కు తరలించాయి. ఈ కేసులో ఈ సంవత్సరం జూలై 16న కోర్టు మార్షల్ మొదలై, 27వ తేదీన ముగిసింది. వారందరికీ జీవితఖైదు శిక్ష విధించినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఈ తీర్పుపై జగదీష్‌భుయాన్ హర్షం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థపైన, ప్రజాస్వామ్యంపైన, క్రమశిక్షణ పైన, భారత ఆర్మీ విధానాలపైన తనకు నమ్మకం ఉందని ఆయన తెలిపారు.

English Title
Assam Fake Encounter: Seven Army Men Sentenced to Life Imprisonment in 24 Year Old
Related News