కృత్రిమ పిండాలు!

Updated By ManamSun, 05/06/2018 - 06:02
image
  • మూలకణాలతో ప్రయోగశాలల్లోనే తయారీ.. అండాలు.. వీర్యకణాలతో ఇక పని లేనట్లే!

  • ప్రాథమిక దశ పిండాల తయారీలో సక్సెస్.. ఇంకా ప్రయోగాలు చేస్తున్న శాస్త్రవేత్తలు

  • ఎలుకలపై చేసిన ప్రయోగం విజయవంతం.. తమలో తాము మాట్లాడుకునే కణాలు

  • ఆ వాతావరణ రూపకల్పనలో తొలి అడుగు.. కృత్రిమంగా మాయ.. పిండాలు సిద్ధం

  • భవిష్యత్తులో సంతాన సాఫల్యం సులువు.. రోగాలు లేని తరాన్ని అందించే అవకాశం

imageసంతానం లేదని బాధపడుతున్నారా? ఎలాంటి చికిత్సలు చేయించుకున్నా ప్రయోజనం ఉండట్లేదా? రకరకాల శారీరక, మానసిక సమస్యలతో సతమతం అవుతున్నారా? ఇక మీరు బేఫికర్‌గా ఉండొచ్చు. అసలు అండాలతోను, వీర్యకణాలతోను సంబంధం లేకుండా మూలకణాల సాయంతో ప్రయోగశాలల్లోనే ప్రాథమిక దశ పిండాలను తయారు చేయడంలో శాస్త్రవేత్తలు సఫలం అయ్యారు. ప్రస్తుతానికి ఇంకా ప్రయోగాల దశలోనే ఉన్నా.. త్వరలోనే మనుషులకు కూడా ఇది ఉపయోగపడచ్చని భావిస్తున్నారు. ఇదే జరిగితే.. సంతాన రాహిత్య సమస్య అనేది అస్సలు ఉండనే ఉండకపోవచ్చు! మూలకణాలు.. జీవరాశుల విషయంలో అత్యంత కీలకం. వీటిని ఉపయోగించి ఇప్పటికే రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. చివరగా, మనుషుల పునరుత్పత్తి మీద కూడా ప్రయోగాలు మొదలయ్యాయి. ఇందుకోసం ముందుగా ఎలుకల మూలకణాలతో ప్రయోగాలు చేశారు.

మూలకణాలతోనే మాయలాంటి పదార్థాన్ని, దాంతో పాటు కృత్రిమ పిండాన్ని రూపొందించి, వాటిని ఎలుకల గర్భాశయంలో ప్రవేశపెట్టినప్పుడు సత్ఫలితాలు వచ్చాయి. ఈ ప్రయోగం ద్వారా అచ్చంగా పిండాన్ని సిద్ధం చేయలేకపోవచ్చు గానీ, సంతాన సాఫల్య చికిత్సలలో మాత్రం మరింత ముందడుగు వేయొచ్చని చెబుతున్నారు. దీనికి సంబంధించిన పరిశోధన వివరాలు ‘నేచర్’ పత్రికలో ప్రచురించారు. ఈ పరిశోధన పుణ్యమాని గర్భం దాల్చడం వెనుక రహస్యాలు కొంతవరకు తెలిశాయని పరిశోధనకు నేతృత్వం వహించిన నెదర్లాండ్స్‌లోని మెర్లిన్ అండ్ హుబ్రెక్ట్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్త నికొలస్ రివ్రాన్ తెలిపారు. ఈ ప్రాథమిక పిండాలకు పూర్తిస్థాయి జీవరాశికి ఉండాల్సిన అన్ని రకాల కణాలు కూడా ఉన్నాయని చెప్పారు. దీనివల్ల జీవం ప్రారంభదశకు సంబంధించి ఇన్నాళ్లుగా రహస్యంగా ఉండిపోయిన విషయాలన్నీ తెలుస్తాయని, తద్వారా సంతానరాహిత్యానికి తగిన పరిష్కారాలు లభిస్తాయని అన్నారు. ప్రయోగశాలలో జంతువులను ఉపయోగించాల్సిన అవసరం లేకుండా కొత్త ఔషధాల తయారీకి కూడా ఇది ఉపయుక్తంగా ఉంటుందట. 

ఐవీఎఫ్‌తో అంతంతే
ప్రస్తుతం సంతాన సాఫల్యం కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్న విధానం.. ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్). అయితే ఇందులో మూడింట రెండొంతుల చికిత్సలు విఫలం అవుతాయి. సాధారణంగా అండాశయంలో ఇంప్లాంటేషన్ చేసేటప్పుడే ఈ వైఫల్యాలు కనిపిస్తాయి. అయితే అందుకు కారణం ఏంటో ఇంతవరకు పెద్దగా ఎవరికీ తెలియదు. 

కొత్త ప్రయోగం ఇలా.. 
సాధారణంగా క్షీరదాలలో అండం ఫలదీకరణ చెందిన కొన్ని రోజుల తర్వాత.. అది ఒక బ్లాస్టోసిస్ట్‌గా రూపాంతరం చెందుతుంది. అందులో 100 కంటే తక్కువ కణాలు ఉంటాయి. అది తర్వాత ఒక బయటి పొరగా (ఇదే భవిష్యత్తులో మాయ అవుతుంది), దాని మధ్యలో ఒక చిన్న సమూహంగా (ఇదే భవిష్యత్తులో పిండం) విడిపోతుంది. ఈ రెండు రకాల పదార్థాలకు చెందిన మూలకణాలను ప్రయోగశాలల్లో అభివృద్ధి చేయడానికి కొన్ని దశాబ్దాలుగా ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే ఇందుకోసం రివ్రాన్ బృందం తొలిసారిగా ఇంజనీరింగ్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి, బ్లాస్టాయిడ్స్‌ను రూపొందించింది. సహజమైన పిండాలలో అయితే అవే మూలకణాలు త్రీడీలో ఉండి మనకు అర్థం కాని భాషలో పరస్పరం మాట్లాడుకుంటాయని రివ్రాన్ చెప్పారు. వీళ్ల ప్రయోగంలో భాగంగా సరిగ్గా అదే విధానాన్ని కృత్రిమంగా రూపొందించారు. దాంతో కణాలు తమంతట తామే.. గర్భాశయంలో ఉన్నట్లుగానే ఒకదాంతో ఒకటి కలిసి క్రమపద్ధతిలోకి మారాయి. గర్భస్థ కణాలు తరచూ మాట్లాడుకుంటాయని, అవి మాయకు సంబంధించిన మూలకణాలకు చెప్పి అవి మరింతగా విస్తరించి అండాశయంలోకి వెళ్లాల్సిందిగా చెబుతాయని ఆయన వివరించారు.

ఈ పరిశోధనల ఫలితంగా పిండాలలో ఉండే చిన్న చిన్న లోపాలను కూడా సరిచేయొచ్చని, దానివల్ల భవిష్యత్తులో మధుమేహం, గుండెకవాటాల వ్యాధుల లాంటివి రాకుండా చూసుకోవచ్చని రెవ్రాన్ బృందం తెలిపింది. ఈ పరిశోధన కారణంగా ఇటు సంతానసాఫల్య చికిత్సలతో పాటు అటు మరింత నాణ్యమైన జీవనాన్ని భవిష్యత్తు తరాలకు అందించేందుకు వీలు కుదురుతోందని, బయోవెుడికల్ క్రమశిక్షణ ఏర్పడేందుకు ఇది మార్గం చూపుతుందని పరిశోధనలో రెవ్రాన్‌తో పాటు పాల్గొన్న టిష్యూ ఇంజనీరింగ్ నిపుణుడు క్లెమెన్స్ వాన్ బ్లిటెర్‌స్విజ్ చెప్పారు.

English Title
Artificial fetuses!
Related News