పెద్దలు కుదిర్చిన పెళ్లి.. ‘పీటలెక్కట్లేదు’!

Updated By ManamMon, 05/07/2018 - 12:27
Arranged Marriages are not Made In Heaven
  • చిన్న చిన్న కారణాలతో సంబంధాలు తిరస్కరించుకుంటున్న కుటుంబాలు

Arranged Marriages are not Made In Heavenపెళ్లిళ్లు స్వర్గంలోనే నిశ్చయమవుతాయంటారు. అదెంతవరకు నిజమో తెలియదుగానీ, పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు మాత్రం స్వర్గంలో డిసైడ్ కావన్నది నేటి తరం అంటున్న మాట. పెళ్లంటే నూరేళ్ల పంట.. మూడు ముళ్ల బంధం.. ఏడడుగుల అనుబంధం.. ఈ మాటలన్నీ ఎలా ఉన్నా కొన్ని పెళ్లిళ్లు మాత్రం అక్కడి వరకూ రాకుండానే సిల్లీ..సిల్లీ కారణాలతో పెటాకులైపోతున్నాయి. పదేళ్ల తర్వాత బట్టతల వస్తుందనో.. లేదంటే అమ్మాయికి జుట్టు పెద్దగా లేదనో (బాబ్ స్టైల్).. అమ్మాయి తన కంటే ఎక్కువగా చదువుకుందనో ఇలా ఎన్నెన్నో చిన్న కారణాలతో ఓ అబ్బాయిని అమ్మాయి, అమ్మాయిని అబ్బాయి తిరస్కరిస్తున్న సందర్భాలు కోకొల్లలు. అలాంటివే కొన్ని...

అమ్మలా వండి పెట్టలేనన్నందుకు..: అబ్బాయి కుటుంబం అంతా డీసెంట్‌గానే ఉంది. కానీ, అమ్మాయిని అబ్బాయి కుటుంబం వద్దంది. కారణం, అమ్మలా తనకు తన భార్య మంచి మంచి వంటకాలు చేసి పెట్టాలని ఆ అబ్బాయి చెబితే తాను అలా చేసి పెట్టలేనని చెప్పడమే. ‘‘దాదాపు ఓ గంట మాట్లాడిన తర్వాత.. రోజూ తన తల్లిలా వంటలు చేసి పెట్టాలి అని ఆ అబ్బాయి అన్నాడు. అంటే రోజూ నాలుగు పూటలా అతడికి ఏం కావాలంటే అది అతడి తల్లి చేసి పెట్టింది అంతే కదా. అతడి తల్లి అంటే గృహిణి కాబట్టి అన్నీ చేసిపెట్టింది. కానీ, నేను అలా కాదు కదా. నేనూ ఓ ఉద్యోగం చేస్తున్నాను. వచ్చే వరకు రాత్రి 8 గంటలు అవుతుంది. అలాంటప్పుడు నాకు ఎలా కుదురుతుంది? అదే వివరంగా చెప్పాను. అన్నీ ఆలోచించుకున్నాక.. నేను హోమ్లీగా లేనని చెప్పి ఆ అబ్బాయి నన్ను వద్దనేశాడు’’ అని ఓ అమ్మాయి తనకు ఎదురైన అనుభవం చెప్పింది. 

పొట్టి జుట్టు అని..: ‘‘నాకు జుట్టు కొంచెం కురచగా ఉంటుంది. అదే కారణంతో అబ్బాయి వాళ్ల అమ్మ నన్ను తిరస్కరించింది. నా జుట్టు పొట్టిగా ఉండడం వల్ల సంప్రదాయ దుస్తులకు సూట్ కాదన్నది ఆమె అభిప్రాయం. అంతేకాదు, నడుం వరకు వాలే జుట్టు లేదు కాబట్టి నేను చీర కట్టినా అందంగా ఉండనన్నది ఆమె ఆలోచన. వాళ్లే నన్ను తిరస్కరించి మంచిదైంది. లేదంటే నేనే వాళ్లను తిరస్కరించి ఉండే దాన్ని’’ అన్నది మరో అమ్మాయి నిట్టూర్పు. 

పబ్బులకెళుతుంది.. అందుకే: ఓ మాట్రిమోనియల్ సైట్‌లో కలుసుకున్న ఓ జంట పెళ్లి చేసుకుందామనుకున్నా చేసుకోలేకపోయింది. కొద్ది రోజుల పాటు వారి స్నేహం కొనసాగినా.. అభిరుచులు తెలుసుకున్నా.. ఆ అమ్మాయి పార్టీ బర్డ్ అని తెలుసుకుని ఆ అబ్బాయి వద్దన్నాడట. ‘‘నాకు పార్టీలంటే ఇష్టమని, వారాంతాల్లో పబ్‌లకు వెళతానని చెప్పడానికన్నా ముందు వరకు మా స్నేహం సజావుగానే సాగింది. చెప్పాక అతడు నిర్మొహమాటంగా వద్దని చెప్పేశాడు. వాళ్ల కుటుంబానికి నేను బాగా ‘మోడర్న్’గా ఉన్నానంటూ పెళ్లి చేసుకోలేనన్నాడు’’ అని ఆ అమ్మాయి వాపోతోంది. 

తనకన్నా తక్కువ చదువే: ఇది ఓ అబ్బాయి ఆవేదన. ఇంజనీరింగ్ చేసి ఆరంకెల వేతనం అందుకుంటూ కుటుంబాన్ని పోషించే సత్తా ఉన్నా కూడా.. తన కన్నా తక్కువే చదువుకున్నాడన్న నెపంతో ఆ అమ్మాయి తిరస్కరించింది. ‘‘నేను ఇంజనీరింగ్ చేశా. బాగానే సంపాదిస్తున్నా. కుటుంబాన్ని పోషించే స్థోమత ఉంది. కానీ, చదువులో నన్ను ఆమె చిన్నోడిని చేసేసింది. ఆ అమ్మాయి ఎంబీయే చేసింది. నాదేమో ఇంజనీరింగే. అది కూడా దేశంలోని టాప్ కాలేజీల్లో ఒకటైన దాంట్లోనే చదివా. అయినా కూడా మున్ముందు నా తక్కువ విద్యార్హతల వల్ల కార్పొరేట్ లైఫ్‌లో పైకి ఎదగలేనేమోనని ఆమె నన్ను వద్దంది. నేను మారు మాట్లాడకుండా ఓ ఆల్ ద బెస్ట్ చెప్పేసి తప్పుకొన్నా’’ అని ఓ పెళ్లి బాధితుడు చెబుతున్నాడు. 

పదేళ్ల తర్వాత బట్టతల.. నాకు నువ్వొద్దు: ఇతగాడిది మరీ చిత్రమైన సమస్య. తన తండ్రికి బట్టతల ఉండడంతో అబ్బాయికి పదేళ్ల తర్వాత బట్టతల వస్తుందని ఏదేదో ఊహించుకున్న ఓ అమ్మాయి.. అతడిని వద్దనేసింది. తన పెళ్లి చెడిపోవడానికి కారణం, ఆ అమ్మాయి వద్దనడానికి కారణం తనకు పదేళ్ల తర్వాత బట్టతల వస్తుందనే భవిష్యత్ భయమేనని అంటున్నాడు ఆ బాధితుడు. 

వాళ్లేం చేశారు మాకు: అమ్మాయిని చూడడానికి వెళ్లినప్పుడు అబ్బాయి తరఫు వారికి చిన్నచిన్న మర్యాదలు చేయడం కామన్. కానీ, అవేవీ చేయలేదన్న వంకతో అమ్మాయిని తిరస్కరించింది ఓ అబ్బాయి కుటుంబం. ‘‘మాట్రిమోనియల్ సైట్‌లో ఓ అబ్బాయిని నేను కలిశా. ఒకరినొకరం అర్థం చేసుకోవాలని చెప్పి కొన్ని రోజుల పాటు స్నేహం చేశాం. మాకూ బాగానే ఉంటుందనిపించి ఓకే చేశా. ఓ రోజు ఇంటికి పిలిచాం. పెద్దవాళ్లు పెళ్లి గురించి మాట్లాడతారని చెప్పి ఇంటికి ఆహ్వానించాం. ఆ రోజు వారికి సకల మర్యాదలూ చేశాం. భోజనం దగ్గర్నుంచి చిరుతిళ్ల వరకూ అన్నీ పెట్టాం. కానీ, అన్నీ తిని మేమేం చేయలేదని చెప్పి వాళ్లు పెళ్లిని తిరస్కరించారు. మరి, వారిని గెలుచుకోవడానికి ఇంకేం మర్యాదలు చేయాలో..! ఇక, చేసేదీ లేక ఇద్దరం వేర్వేరు దారులు చూసుకున్నాం’’ అంటున్న మరో యువతి ఆవేదన ఇది. 

అయ్యో.. పిల్లలూ నల్లగా పుడితే..: ‘‘నేను చామనఛాయగా ఉంటాను. ఎర్రగా బుర్రగా ఉండే అబ్బాయి నన్ను చూడడానికి వచ్చాడు. నేను చామనఛాయ కాబట్టి పిల్లలు కూడా అలాగే పుడతారని భావించిన సదరు వ్యక్తి నన్ను వద్దన్నాడు. ఆ సంబంధం కుదరకపోవడమే నయమైంది’’ అని మరో యువతి ఇలాంటి భయాలున్న ఆ వ్యక్తితో సంబంధం కుదరకపోవడంతో ఆ దేవుడికి కృతజ్ఞత చెప్పుకొంది.

ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. అలాంటి ఇంకా ఎన్నెన్నో సిల్లీ సిల్లీ కారణాలతో తమ గుమ్మం దాకా వచ్చిన సంబంధాలను కాదనేస్తున్నారు అబ్బాయిలు, అమ్మాయిలు. అలా చెప్పుకొంటూ పోతే ఆ జాబితా చాలా పెద్ద చిట్టానే అవుతుంది. నిజమేలెండి.. నూరేళ్ల పంట అని పిలిచే పెళ్లి జీవితం.. సుఖంగా సాగాలంటే ప్రతి ఒక్కటీ చూసుకోవాలి మరి. మన మనసుకు కాదనిపించిన ఏ ఒక్క నిర్ణయం తీసుకున్నా అంతిమంగా జీవితంలో బాధపడేది సదరు జంటే కదా. కాబట్టి ఇలాంటివీ ఒకందుకు మంచే అనుకోవాలి. అన్నీ ముందే తెలిస్తే సరిపోతుంది కదా. ఏదేమైనా గానీ చిన్ని చిన్న కారణాలతో ఇలాంటి ఎన్నో పెళ్లిళ్లు నేడు పీటలదాకా వెళ్లడం లేదన్నది మాత్రం అక్షర సత్యం. 

English Title
Arranged Marriages are not Made In Heaven
Related News