అమ‌లాపురం ర‌మ్య‌.. అమెరికాలో మెరిసింది...!

Amalapuram Ramya, MISS USA, NRI, Ramya Vadlamani
  • మిస్ ఇండియా యుఎస్ఎ, మిస్ టాలెంట్ ఒరెగాన్-2018 విజేత మ‌న తెలుగ‌మ్మాయే

  • 2019 ఫిబ్రవరి 17న నిర్వహించనున్న మిస్ యుఎస్‌ఎకు ఎంపిక

  • రమ్యను అభినందించిన ప్ర‌వాసాంధ్రులు, ఎన్నారైలు 

అమ‌రావ‌తి: అమెరికా దేశంలోని పోర్ట్‌ల్యాండ్ ఒరెగాన్ రాష్ట్రంలో శ‌నివారం నిర్వహించిన అందాల, ప్రతిభా పోటీలలో మిస్ ఇండియా మరియు మిస్ టాలెంట్ ఒరెగాన్-2018 విజేతగా అమలాపురానికి చెందిన రమ్య వడ్లమాని నిలిచారు. పోటీల‌లో అమెరికాలో నివాసం ఉంటున్న ఇండియాకు చెందిన మొత్తం 20 మంది ఫైనల్స్‌కు అర్హత సాధించగా వారిలో రమ్య వడ్లమాని విజేతగా నిలిచారని ఆమె తల్లిదండ్రులు రాజా, లక్ష్మీలు తెలిపారు. పోటీల్లో భాగంగా ఆధునిక పోకడలకు ఆకర్షితుల‌వుతున్న యువతకు మీరు ఇచ్చే సూచనలు ఏమిటని నిర్వాహకులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా యువత యుక్తవయసు దాటిన వెంటనే విచక్షణతో కూడి వ్యవహరించాల్సి ఉంటుందని ర‌మ్య వ‌డ్ల‌మాని పేర్కొన్నారు. 

ఈ వయసులో వేసే ప్రతి అడుగు ఆచితూచి వేయాలని ఏ చిన్న తప్పిదం చేసినా వారి భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని అందుకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్న విషయాన్ని వారికి వివరించడానికి ప్రాధాన్యత ఇస్తానని ఆమె సమాధానం ఇచ్చారు. మహిళలు లాభాపేక్ష లేకుండా సమాజ శ్రేయస్సుకు తమ వంతు పాత్రను పోషిస్తున్నారని, భారతీయ మహిళలు మహిళా సాధికారిత దిశగా అడుగులు వేస్తున్నారని ఆమె తెలిపారు. మిస్ ఇండియా మరియు మిన్ టాలెంట్ ఒరెగాన్-2018 విజేతగా రమ్య వడ్లమానిని ఈ సంద‌ర్భంగా పలువురు ప్రవాసాంధ్రులు, ఎన్నారైలు అభినందించారు. అమెరికాలో 2019 ఫిబ్రవరి 17న నిర్వహించనున్న మిస్ యుఎస్ పోటీలకు రమ్య వడ్లమాని అర్హత సాధించారు.

సంబంధిత వార్తలు