అలోక్‌పై వేటు

alokverma
  • సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి తొలగింపు

  • రెండు రోజులే అలోక్ వర్మ పదవి

  • మోదీ నేతృత్వంలో కమిటీ నిర్ణయం

  • రెండు రోజుల పాటు కమిటీ భేటీ

  • చివరకు సాగనంపాలని అభిప్రాయం

  • ఈలోపే ఐదుగురు అధికారుల బదిలీ

  • పది మంది అధికారుల బదిలీలు రద్దు

  • అలోక్ వర్మ సంచలన నిర్ణయాలు

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తీర్పు పుణ్యమాని సుమారు 48 గంటల పాటు మళ్లీ పాత వైభవాన్ని అనుభవించిన సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను సాగనంపాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని హైపవర్ కమిటీ నిర్ణయించింది. దాంతో ఆయనపై వేటు పడింది. డైరెక్టర్ పదవి నుంచి అలోక్‌వర్మను తక్షణం తప్పించాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. లోక్‌సభలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడు, ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉండే ఈ కమిటీకి కాంగ్రెస్ నుంచి మల్లికార్జున ఖర్గే రాగా.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ బదులుగా ఆయన పంపిన ప్రతినిధి జస్టిస్ ఏకే సిక్రీ హాజరయ్యారు. అలోక్‌వర్మ మీద వచ్చిన ఆరోపణలు.. వాటిపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ విచారణ తదితర అంశాలపై రెండు రోజుల పాటు ముమ్మరంగా చర్చించిన ఈ కమిటీ.. ఆయనను ఆ పదవి నుంచి తప్పించడమే సబబని భావించింది. సుప్రీంకోర్టు కూడా అలోక్ వర్మను సీబీఐ డైరెక్టర్ పదవిలో నియమించాలని చెప్పినా, ఈ కమిటీ నిర్ణయాన్ని బట్టే ఆయనను ఉంచాలా.. దించాలా అనేది ఉంటుందని స్పష్టం చేసింది. దాంతో ఇక అలోక్‌వర్మకు ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. అయితే... రెండు రోజుల పాటు సీబీఐ డైరెక్టర్ పదవిని అనుభవించిన అలోక్ వర్మ.. వెంటనే చాలా పనులు చేసేశారు. తాత్కాలిక డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు చేసిన బదిలీలలో ఒక్కటి తప్ప మిగిలిన అన్నింటినీ.. అంటే సుమారు 10 వరకు బదిలీలను రద్దు చేశారు. దాంతోపాటు కొత్తగా ఐదుగురు అధికారులను బదిలీ చేశారు. ఆయన రద్దు చేసిన బదిలీ ఉత్తర్వులలో చాలావరకు అక్టోబరు 23న జారీ అయ్యాయి. కొన్ని ఈ నెల ఆరంభంలో జారీ అయ్యాయి. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ ఆస్థానా కేసును విచారిస్తున్న అధికారులలో కొందరిని కూడా బదిలీ చేశారు. సాధారణంగా సీబీఐ లాంటి సంస్థలలో బదిలీలను విధాన నిర్ణయాలుగా కాకుండా.. పరిపాలనాపరమైన నిర్ణయాలుగా భావిస్తారు. అలోక్‌వర్మ ఇలా బదిలీ రద్దు చేసినవారిలో గుజరాత్ కేడర్ 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఏకే శర్మ కూడా ఒకరు. ఆయన అత్యంత కీలకమైన విధాన డివిజన్ బాధ్యతలు చూస్తున్నారు. అంతకుముందు నాగేశ్వరరావు బదిలీ చేసిన 13 మంది అధికారులు వర్మ వద్దకు వచ్చి.. తమ బదిలీ ఉత్తర్వులు రద్దు చేయాలని కోరారు. వారిలో డీఐజీ ఎంకే సిన్హా, డీఎస్పీలు అశ్వినీ గుప్తా, ఏకే బస్సీ కూడా ఉన్నారు. వీరిలో బస్సీని అండమాన్‌కు బదిలీ చేసిన విషయం తెలిసిందే. సిన్హాను నాగ్‌పూర్‌కు, గుప్తాను తన మాతృశాఖ అయిన ఇంటెలిజెన్స్ బ్యూరోకు పంపారు. ఈ ముగ్గురూ రాకేశ్ ఆస్థానాపై విచారణ జరుపుతున్న తరుణంలో బదిలీలకు గురయ్యారు. ఈ ముగ్గురూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించి.. ఇంటర్వెన్షన్ దరఖాస్తులు దాఖలు చేశారు. అప్పటికే అలోక్‌వర్మ తనను బలవంతపు సెలవు మీద పంపడాన్ని సవాలు చేశారు. దాంతో వాళ్లు కూడా తమను ఈకేసులో పార్టీలుగా చూడాలని కోరారు. తన బదిలీ ఉత్తర్వులపై సుప్రీంకోర్టుకు వెళ్లని అదనపు ఎస్పీ ఎస్‌ఎస్ గుర్మ్ కూడా జబల్‌పూర్ నుంచి తిరిగి ఢిల్లీకి వచ్చారు. ఆయన కూడా ఆస్థానా కేసును దర్యాప్తుచేసిన బృందంలో ఉన్నారు. బాధ్యతలు స్వీకరించిన వర్మను సీబీఐ ప్రధాన కార్యాలయ భవనం ప్రవేశద్వారం వద్ద తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరరావు స్వాగతించారు. ఆయన వెంటనే లోపలకు వెళ్లి.. వివిధ కీలకాధికారులతో సమావేశాలు నిర్వహించారు. రోజంతా సీనియర్ అధికారులు పలువురు ఆయన చాంబర్‌లోపలకు, బయటకు వెళ్లి వస్తూనే కనిపించారు. అయితే 77 రోజుల పాటు బలవంతపు సెలవులో ఉండటంతో అలోక్‌వర్మ ఈ కాలం మొత్తాన్ని తన సర్వీసు నుంచి కోల్పోయినట్లవుతుంది. దాని విషయం ఏం చేయబోతున్నారన్నది కూడా ఇంకా స్పష్టం కాలేదు. 

ఐదుగురు అధికారుల బదిలీ
జాయింట్ డైరెక్టర్ అజయ్ భట్నాగర్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డీఐజీ) ఎంకే సిన్హా, డీఐజీ తరుణ్ గౌబా, జాయింట్ డైరెక్టర్ మురుగేశన్, అదనపు డైరెక్టర్ ఏకే శర్మలను బదిలీ చేశారు. అయితే వీళ్లను ఎక్కడకు పంపినదీ మాత్రం ఇంకా తెలియలేదు. ఇప్పుడు అలోక్‌వర్మపై మళ్లీ వేటు పడటంతో.. ఈ బదిలీలు కూడా ఉంటాయో, రద్దవుతాయో చూడాల్సి ఉంది.

Tags

సంబంధిత వార్తలు