కూటమి గెలుపే ముఖ్యం

Updated By ManamTue, 10/23/2018 - 06:58
babu
  • మన సీట్ల సంఖ్య చూడొద్దు.. గెలిచే స్థానాలనే ఆశించండి

  • విజయం సాధిస్తే నామినేటెడ్ పదవులొస్తయ్

  • సర్వశక్తులూ ఒడ్డి పోరాడండి.. తమ్ముళ్లకు చంద్రబాబు దిశానిర్దేశం

  • తమ్ముళ్లకు చంద్రబాబు దిశానిర్దేశం

babuహైదరాబాద్: ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడంకంటే.. గెలిచే నియోజకవర్గాల్లో పోటీ చేయడమే ఉత్తమమని, ఆ మేరకే టికెట్లు ఆశించాలని టీటీడీపీ నాయకత్వానికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సూచించారు. సీట్లపై ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని, తొలుత కూటమి గెలుపునకు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. కూటమి అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవులు దక్కుతాయని ఆశావాహులకు సర్దిజెప్పే ప్రయత్నం చేశారు. ఇక్కడ ప్రజాకూటమి గెలుపు, జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటయ్యే ఫ్రంటుకు తోవ చూపినట్లవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో టీటీడీపీ పొలిట్‌బ్యూరో, రాష్ట్ర, జిల్లా పార్టీ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. తొలుత పొలిట్‌బ్యూరో సభ్యులతో బాబు భేటీ అవగా, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులను, కూటమిలో సీట్ల సర్దుబాటు సమస్యను టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ఆయనకు వివరించారు. అనంతరం నాయకులతో విడివిడిగా, బృందాలవారీగా బాబు చర్చలు జరిపారు.

మరో ఆరింటికి ప్రయత్నిస్తా...
టీటీడీపీకి 12 సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఇప్పటికే అంగీకరించగా, మరో 6 సీట్ల కోసం తాను ప్రయత్నిస్తానని బాబు చెప్పినట్లు సమాచారం. జంట నగరాల్లో పార్టీకి పట్టున్న సీట్లను వదులుకోవద్దని, గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన స్థానాలు, ప్రస్తుతం బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలున్న పలు నియోజకవర్గాల్లో టీడీపీ బలాబలాలను ఆయన గుర్తు చేశారు. గత రెండు సాధారణ ఎన్నికల్లో వరసగా టీడీపీ గెలిచిన స్థానాలు, స్వల్ప తేడాతో రెండో స్థానంలో నిలిచిన స్థానాల నుంచి టికెట్ ఆశిస్తున్న వారి వద్ద బాబు బయోడేటాను స్వీకరించారు. టీటీడీపీ తరపున ప్రచారానికి సైతం బాబు అంగీకరించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ పోటీజేసే స్థానాల్లో 4 భారీ బహిరంగ సభలను నిర్వహించాలని ఆయన సూచించనట్టు తెలిసింది. మహబూబ్‌నగర్, హైదరాబాద్ సహా మరో రెండు జిల్లాల్లో ఈ సభలు జరగనున్నాయి.

పెద్దిరెడ్డికి కూకట్‌పల్లి టికెట్!
ఉప్పల్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి స్థానాలు టీడీపీకే ఖరారైనట్టు తెలుస్తోంది. కూకట్‌పల్లి నుంచి మాజీ మంత్రి, టీటీడీ సభ్యుడు పెద్దిరెడ్డికి, శేరిలింగంపల్లి నుంచి భవ్య సిమెంట్స్ అధినేత ఆనంద్‌ప్రసాద్‌కు బాబు అవకాశమిచ్చినట్టు సమాచారం. ఉప్పల్ నుంచి మాజీ మంత్రి దేవేందర్‌గౌడ్ కొడుకు వీరేందర్‌గౌడ్‌కు టికెట్ కేటాయిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జూబ్లిహిల్స్, ఖైరతాబాద్ టికెట్లు కూడా టీడీపీకి దక్కే అవకాశముందని బాబు వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

మూడు దశల్లో చర్చలు
సీట్ల సర్దుబాటుపై కూటమి భాగస్వామ్య పక్షాలతో ఎల్ రమణ, నామానాగేశ్వర్‌రావు చర్చలు జరుపుతున్నారని పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఈ చర్చలు మూడు దశల్లో ఉంటాయన్నారు. తొలుత ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీజేయాలన్న దానిపై స్పష్టత వచ్చాక, ఏయే సీట్లను ఎవరు తీసుకోవాలన్నదానిపై చర్చిస్తామన్నారు. చివరి దశలో ఆ సీటులో పోటీజేసే అభ్యర్థిని ఆయా పార్టీలు ఖరారు చేస్తాయని చెప్పారు. ప్రస్తుతం చర్చలు తొలి దశలో ఉన్నాయన్నారు.

English Title
Alliance is important to win
Related News