ఇక బాధలన్నీ బంద్

Updated By ManamFri, 08/10/2018 - 01:03
harish
  • రైతుల కోసం ఎంతైనా చేస్తాం.. రైతు బీమాతో పెరుగనున్న ధీమా

  • కాంగ్రెసోళ్లకు చీకటి - రైతన్నలకు వెలుగులు

  • రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు

harishసిద్దిపేట: రైతంటే అలుసు... బాధలొస్తే కనీసం పలకరించేటోడే లేడు...సహాయం కోసం ఎదు రు చూపులు.. ఇవన్నీ ఒకప్పటి మాటలని, టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చాక రైతుల బాధలన్నీ బంద్ అవుతున్నాయని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. అందరికీ అన్నంపెట్టే అన్న దాత కోసం ఎంత చేసేందుకైనా సిద్ధమన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చేపడుతున్న ఒక్కో కార్య క్రమం అన్న దాతల అభివృద్ధి కోసమేనని, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాలతో రైతుల్లో ఆత్మవిశ్వాసం అంతకంతకూ పెరుగు తూ వస్తుందన్నారు. ఈనెల 15వ తేది నుండి అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న రైతు బంధు జీవిత బీమా పథకం బాండ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం నాడు సిద్దిపేటలో రాష్ట్ర మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. సిద్దిపేటలో జరిగిన వేరువేరు కార్యక్రమాలలో సిద్దిపేట మండలంలో ఆరువేలమంది రైతులకు బాండ్‌లను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ రైతులు తమకిది కావాలని అడగకున్నా, ఇది చేయండంటూ ఒక్క దరఖాస్తు కూడా ఇవ్వకున్నా ఏ రాష్ట్రంలో ఎవ్వరూ చేయని విధంగా రైతులపై ఉన్న ప్రేమతో రూ. 1000 కోట్లను ఖర్చు చేస్తూ ఒక్కో రైతుపేర ఒక్కో సంవత్సరం ప్రీమియమ్‌గా రూ. 2271 వేలను చెల్లిస్తుందన్నారు. మొన్నటికి మొన్న అన్నదాతలు పెట్టుబడుల కోసం చేతులు చాచొద్దని ఎకరాకు సంవత్సరానికి రూ. 8 వేలు, నాణ్యమైన 24 గంటల విద్యుత్ సరఫరా, ఇప్పుడు అన్నదాత ధీమాగా ఉండేందుకు రైతుబీమా కార్యక్రమాలను చేపడుతూ వస్తుందన్నారు. రైతుల్లో మనోధైర్యాన్ని పెంచేందుకు రైతుబంధు తోడ్పడితే భరోసా పెంచేందుకు రైతు బీమా ఉపకరిస్తుందన్నారు. ఈ కార్యక్రమాలు ఒక్క సంవత్సరంతో ఆగేవి కావని నిరంతర ప్రక్రియ అని, బాండ్‌లు రాని రైతులు ఇప్పటికి కూడా పేర్లను నమోదు చేసుకోవచ్చన్నారు.

గత పదేళ్ల కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు ఆత్మన్యూనతా భావానికి లోనై తామున్నామని భరోసా ఇచ్చేవారు కరువవడంతో పిట్టల్లా రాలిపోయారని, కానీ గత నాలుగేళ్లుగా  ఆత్మహత్యలు తగ్గి తమను ఆదుకునేందుకు ప్రభుత్వం ఉందన్న ధీమాను కల్పించిన ఘనత టీఆర్‌ఎస్‌దే అన్నారు. తెలంగాణ వస్తే వెలుగులు పోయి తెలంగాణ అంతా చీకటి అవుతుందని పెదవి విరుపు మాటలు మాట్లాడితే తెలంగాణ వచ్చాక గత నాలుగేళ్లలో 24 గంటల విద్యుత్ సరఫరా చేసుకొని రైతుల కళ్లల్లో వెలుగులు నింపితే కాంగ్రెసోళ్ల పని మాత్రం చీకటి అయిందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఎరువుల కొరత, విత్తనాల కొరత, కరెంటు కోతలు ఉండేవని, కానీ టీఆర్‌ఎస్ ఏలుబడిలో అన్నదాతకు కావాల్సిన అన్ని సౌకర్యాలు సమకూర్చుతూ మద్దతు ధర కల్పించాలన్న లక్ష్యంతో ప్రతి పంటను చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ హయాంలో పదేళ్లలో ఐదు లక్షల ఎకరాలకు నీరిస్తే కేవలం నాలుగున్నరేళ్లలో టీఆర్‌ఎస్ సర్కార్ 12 లక్షల కొత్త ఆయకట్టుకు నీరిచ్చిందన్నారు.

రైతే రాజు కాబోతున్నాడన్న ఆత్మస్థైర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. మక్క, వరి ఎండొద్దని వరుణుడి కోసం పూజలు చేయాల్సిన అవసరం లేదని, మరికొద్ది రోజులు ఆగితే ప్రతి రోజు చెరువు కుంటల మత్తడి దుంకుతూ అన్నదాత ఆనందంగా బతికే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. కాళేశ్వరం పూర్తయితే కాలమైనా, కాలం కాకపోయినా చెరువులు నిండి రైతుల కష్టం తీరబోతుందన్నారు. ప్రభుత్వానికి రైతులంటేనే ఎంతో ప్రేమని, రైతుల కోసం ఎంత చేసేందుకైనా సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనికి అడ్డుపుల్ల వేస్తూ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు ఇంకా కొంత మంది బయల్దేరుతారని, వారి మాటలు నమ్మొద్దన్నారు. వానొస్తే ఉసిళ్లు, ఎన్నికలొస్తే కాంగ్రెసోళ్లు పల్లెల్లోకి రావడం పరిపాటేనని, వారి మాటలు నమ్మితే తెలంగాణ అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పద్మాకర్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు వంగ నాగిరెడ్డి, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్‌రెడ్డి,  ఆర్డీఓ ముత్యంరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
 

image

 

English Title
All the sufferings are bandh
Related News