పైలట్ అత్యుత్సాహం.. ఫుల్‌గా ఏసీ వదిలి.. 

Updated By ManamThu, 06/21/2018 - 17:29
AirAsia pilot, hounds passengers de-board, AC blower on full blast
  • వణికిపోయిన ప్రయాణికులు.. కోల్‌కతా- బగ్డోరా విమానంలో ఘటన

  • గంటల కొద్దీ ఆలస్యం.. ఎయిర్ఏషియా క్షమాపణలు.. 

AirAsia pilot, hounds passengers de-board, AC blower on full blastగువహటి: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్‌ఏషియా అత్యుత్సాహన్ని ప్రదర్శించి విమర్శలపాలైంది. విమానంలో నుంచి ప్రయాణికులు దిగడం లేదని పైలట్ ఫుల్‌గా ఏసీ వదిలిన ఘటన భయాందోళనకు గురిచేసింది. కోల్‌కతా నుంచి బగ్డోరా వెళ్లే ఎయిర్ఏషియా విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికుల పట్ల సిబ్బంది అమర్యాదగా ప్రవర్తించారంటూ ఇప్పటికే పలు విమానయాన సంస్థలు ఆరోపణలు ఎదుర్కొంటుండగా తాజాగా జరిగిన ఈ ఘటనతో మరోసారి రుజువైంది. అసలే అరగంట ఆలస్యం.. ఆపై విమానంలో ఎక్కి కూచున్నాక మరో గంటన్నర జాప్యం.. ఆనక ఎలాంటి కారణం చెప్పకుండానే ప్రయాణికులందరూ కిందికి దిగాలంటూ పైలట్ సూచన!

అప్పటికే విసిగెత్తి ఉన్న ప్రయాణికులు దిగడానికి ససేమిరా అన్నారు. పైగా బయట వర్షం కూడా పడుతుండడంతో ఎవరూ సీట్లలో నుంచి లేవలేదు. తమ వద్దకు వచ్చిన సిబ్బందితో వాగ్వాదం పెట్టుకోవడంతో ప్రయాణికులను కిందికి దించేందుకు విమానంలోని ఏసీని పైలట్ అమాంతంగా పెంచేశాడు. దీంతో విమానంలో భయానక వాతావరణం నెలకొంది. పలువురు మహిళలు వాంతులు చేసుకోగా.. పిల్లలు ఏడుపు మొదలెట్టారు. ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియాకు చెందిన విమానంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. కోల్‌కతా నుంచి బగ్డోరా వెళ్లవలసిన ప్రయాణికులకు ఈ భయంకర అనుభవం ఎదురైంది. ఈ సంఘటన జరిగినపుడు అక్కడే ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పశ్చిమ బంగా ఈడీ దీపాంకర్ రే ఓ వీడియో తీసి తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

ప్రయాణికులతో ఎయిర్ ఏషియా సిబ్బంది ప్రవర్తన అమర్యాదకరంగా, అభ్యంతరకరంగా ఉందని రే విమర్శించారు. ఉదయం 9 గంటలకు బయలుదేరాల్సిన విమానం అధికారికంగా అరగంట లేటని ప్రకటించారని రే చెప్పారు. అయితే బోర్డింగ్ తర్వాత ఈ జాప్యం మరింత పెరిగిందని, సుమారు గంటన్నరకు పైగా అలాగే తమ సీట్లలో కూర్చుండిపోయామని వివరించారు. 

ఆ సమయంలో కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అంతా కిందికి దిగాలని పైలట్ సూచించినా.. తాము దిగడానికి నిరాకరించామని చెప్పారు. దీనిపై సిబ్బందికి, ప్రయాణికుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొందని వివరించారు. అనంతరం పైలట్ దుందుడుకు చర్యతో విమానంలోని ప్రయాణికులందరూ ఇబ్బంది పడ్డారని, శ్వాస కూడా ఆడలేదని రే మండిపడ్డారు. ఆపై కిందికి దిగిన వారిని విమానాశ్రయంలోని ఫుడ్‌కోర్టుకు వెళ్లాలని సిబ్బంది సూచించారని చెప్పారు. బోర్డింగ్ పాస్ చూపిస్తే వారు ఆహారం అందజేస్తారని చెప్పినా.. ఫుడ్‌కోర్టు నిర్వాహకులు తిరస్కరించారని ఆయన వివరించారు.

ఆ తర్వాత మళ్లీ విమానం ఎక్కాక ఎయిర్‌ఏషియా సిబ్బంది తలా ఓ శాండ్‌విచ్‌తో పాటు చిన్న వాటర్ బాటిల్ అందించారన్నారు. కాగా, ఈ ఘటనపై ఎయిర్‌ఏషియా స్పందిస్తూ.. ప్రయాణికుల భద్రతకే తాము అధిక ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేసింది. విమానం ఆలస్యం కావడం నిజమేనని అంగీకరించిన సంస్థ.. సాంకేతిక కారణాలే దానికి కారణమని పేర్కొంది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరింది. ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని తెలిపింది.

English Title
AirAsia pilot allegedly hounds passengers to de-board, keeps AC blower on full blast
Related News