మధుమేహంలో నాలుగో రకం

Updated By ManamSat, 06/09/2018 - 13:14
AIIMS Discovers Type-4 diabetes
  • గుర్తించిన ఢిల్లీ ఎయిమ్స్ శాస్త్రవేత్తలు.. గ్లాకోమాతో సంబంధం

AIIMS Discovers Type-4 diabetesన్యూఢిల్లీ: మధుమేహంలో ఇప్పటిదాకా రెండు రకాలు మాత్రమే ఉండేవి. అందరికీ తెలిసింది టైప్-1, టైప్-2 మధుమేహం మాత్రమే. కానీ, ఇప్పుడు శాస్త్రవేత్తలు టైప్-4 మధుమేహాన్ని గుర్తించారు. న్యూఢిల్లీలోని ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వైద్యులు ఈ టైప్-4 మధుమేహాన్ని గుర్తించారు. ఈ రకం మధుమేహం కళ్లు, మెదడుపై ప్రభావం చూపిస్తుందని కనుగొన్నారు. గ్లాకోమా గురించి తెలిసే ఉంటుంది. కంటికి సంబంధించిన ఈ సమస్యతో చూపే పోయే ప్రమాదం ఉంటుంది. ఈ టైప్-4 మధుమేహం కూడా కంటికి సంబంధించిందే కాబట్టి గ్లాకోమా చికిత్సకు మంచి ప్రత్యామ్నాయాలను కనుగొనేందుకు వీలుంటుందని చెబుతున్నారు. డయాబెటిస్ టైప్-3 (అల్జీమర్స్), టైప్ 4 (గ్లాకోమా).. మెదడు, కళ్ల కణజాలాలను దెబ్బ తీస్తాయని, రక్తంలో చక్కెర స్థాయులతో వీటికి సంబంధం లేదని చెబుతున్నారు. గ్లాకోమాకు మెదడుతో సంబంధం ఉందని చెప్పడానికి జన్యు, జీవరసాయన ఆధారాలున్నాయని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ఎయిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ మునీబ్ ఫైఖ్ తెలిపారు. 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల మంది గ్లాకోమా బాధితులుంటారని చెప్పారు. కొన్ని సందర్భాల్లో దానిని మందులతో తగ్గించలేమని, శస్త్రచికిత్స ఒక్కటే మార్గమని, అలాంటి గ్లాకోమాకు టైప్-4 డయాబెటిస్‌తో లింకుంది కాబట్టి భవిష్యత్తులో మెరుగైన చికిత్సలకు ఆస్కారం లభిస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం భారత్‌లో 40 ఏళ్లకు పైబడిన 1.12 కోట్ల మంది గ్లాకోమాతో బాధపడుతున్నారు. 

English Title
AIIMS Discovers Type-4 diabetes
Related News