ఆధునిక మనువాద విశ్వరూపం

Updated By ManamWed, 07/11/2018 - 00:54
image

imageకత్తి మహేష్‌ను హైదరాబాద్ నుంచి వెలివేస్తూ తె లంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి విధించిన శిక్షలో ఆధునిక మనువాదం తప్ప మరొకటి కనిపించటం లేదు. కత్తి మహేష్‌ను హిందువులకు విలన్‌గా చిత్రీకరి స్తూ అంతకంటే ఎక్కువ ప్రమాదకరంగా పరిపూర్ణా  నంద మాట్లాడాడు. కానీ రాష్ట్ర డీజీపీకి సాధారణ హిందువుల్లో ఉద్రిక్తతలు రెచ్చగొడుతూ ప్రసంగాలు చేసిన పరిపూర్ణానంద అనే వ్యక్తి నేరస్థుడుగా కనిపించ లేదు గానీ, అసలు ఉన్నాడో లేడో తెలియని రాముడిపై కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు చాలా ఉద్రిక్తతలు రెచ్చగొట్టేటివిగా కనిపించాయట.

డీజీపీ మహేందర్ రెడ్డి ఇరువురినీ నిరోధించటానికి వేసిన శిక్షలు చాలా గమనార్హమైనవి. కత్తి మహేష్‌కి 6 నెలల నగర (రాష్ట్ర) బహిష్కరణ విధిస్తూ తన గ్రామ జీవితానికి తనను పంపివేత, ‘పరిపూర్ణానంద ద్వారా ఉద్రిక్తతలు పెరగ కుండా’ అతన్ని హౌస్ అరెస్ట్ పేరుతో జూబ్లిహిల్స్‌లోని సొంత ఇంటి చుట్టూ పోలీసుల కాపలా. ఫలితం, కత్తి మహేష్ అతను ఎక్కడి నుంచి విముక్తం కావాలను కున్నాడో తిరిగి అదే వెలివాడకు ప్రాణభయంతో సిద్ధ మవుతుండగా అంతకంటే చట్ట వ్యతిరేకంగా మాట్లా డిన పరిపూర్ణానంద జూబ్లిహిల్స్‌లో జేజేలు అందు కుంటూ వికటాట్టహాసం చేస్తున్నాడు. చరిత్ర నిండా హేతువాదులు అణచివేయబడ్డారు, చంపబడ్డారు తప్ప వాళ్ళకెప్పుడూ అల్లర్లకు కారణమయ్యేంత, ప్రతి దాడులు చేసేంత మందబలం లేదు. ఇప్పుడు డీజీపీ గారు మాత్రం మతవాదులకు మద్దతు పెంచుతూ, బలహీనుడైన కత్తి మహేష్‌ని ఇలా అసాధారణంగా శిక్షించటం వెనుక కేవలం అల్లర్ల నిరోదమే ఉందా లేక వర్ణ వివక్షను అమలు చేయటానికి అంతా ఏనాడో మర్చిపోయిన ఒక చట్టాన్ని వాడుకున్నారా!
 

రెండోదే జరిగిందనేది ఈ అసాధారణ, అసహజ చర్య దానికదే సాక్ష్యం చెప్పు కుంటున్నది. ఈ శిక్షలో సమాన న్యాయం లేదు దళితులను ఊరి బయట ఉంచటం వంటి వివక్ష తప్ప. ఎక్కడున్నాం మనం, ప్రజాస్వామిక సమాజంలోనా లేక వర్ణ వివక్ష, మనుధర్మాలు అమలైన ప్రాచీన రాచరికపు, అనాగరికపు సమాజాల్లోనా! ఇంకెప్పుడు ఈ దేశం వర్ణ, కుల వివక్షతో కూడిన విలువల నుంచి బయట పడుతుంది. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ప్రభుత్వమే ఇంత నిస్సిగ్గుగా వివక్షతో కూడిన శిక్షలు వేస్తుంటే రాజ్యాంగాన్ని ఎవరు పరిరక్షించాలి. ఇంకా ఎంతకాలం బలహీనులను అజ్ఞానంలో ఉంచటానికి లేదా అణచివేయటానికి అదే దేవుడినీ, మతాలను, ‘సెంటుమెంటు’ను వాడుకుంటారు. ప్రజాస్వామిక న్యాయం అంటూ ఉండదా, అంతా సెంటిమెంటు రాజకీయాలు, సెంటిమెంట్ శిక్షలేనా? పేరుకు రాజ్యాం గం, పార్లమెంటు, కోర్టులు. కానీ విధానాలు పాతవే, శిక్షలూ పాతవే, శిక్షలకు గురయ్యే వాళ్ళూ శిక్షలు వేసే వాళ్ళూ ఆయా పాతవర్గాల వారసులే. కత్తి మహేష్ వ్యక్తిగతంగా ఎటువంటి మనిషి? ప్రజాస్వా మికవాదులందరూ సమర్థించదగ్గ వ్యక్తేనా అనేది ఇక్కడ ముఖ్యం కాదు. ఆయనకు అల్లర్లు లాంటివి సృష్టించే ఉద్దేశం కూడా లేదు. కానీ ఆయన ఆధిపత్య వర్గాలకు, పోలీసు లకు ఒక ఈజీ టార్గెట్ అయ్యాడు. కానీ, హిందూ మతం, వర్ణధర్మం ద్వారా తరతరాల అణచి వేతకు గురైన వ్యక్తిగా మహేష్‌కి తన సాంఘిక స్థానానికి కారణమైన, తనను ఊరుకు దూరంగా ఉంచిన మతాల్ని, కావ్యాల్ని అధ్యయనం చేసే హక్కు, ఆ విలువల్ని విమర్శించే హక్కు అతనికి గ్యారంటీగా వేరెవరికంటే కూడా ఎక్కువగా ఉంటుంది. అతని ప్పుడు ఆ మతంలో ఉండక పోనీ గాక.
 

మతం మారినా కూడా అతని సామాజిక హోదా మారని దుస్థితికి కారణమైన విలువల్ని ప్రశ్నించ కుండా అతని సామాజిక స్థానం ఎలా మారుతుంది. మాట్లాడితే ‘సెంటుమెంటు’ అంటూ మేమేం మాట్లాడాలో మీరే నిర్ణయిస్తే మా సామాజిక శత్రువుల్ని మేం ఎలా గెలవగలం. నిజమే, తమకింద అణగి ఉండాల్సిన వాళ్ళు గెలవకూడదన్నదే వీరందరి పన్నాగం కావచ్చు. అంతకు మించి ఏ శాంతి భద్రతల సమస్యా లేదు. ఈ దాడి, ఈ శిక్ష ద్వారా వాళ్ళు శూద్ర నిమ్నకులాలు, దళితులకొక హెచ్చరిక పంపారు. కులాలను స్థిరీకరించటం, తరతరాలుగా విద్యను, సంపదను కేవలం తమవరకే రిజర్వుడ్‌గా ఉంచుకోవటం ఈ ఆధిపత్యం పురాతనకాలం నుంచి కొనసాగటానికి కీలక సాధనంగా ఉంటూ వస్తున్నది. మనుషులందరికీ సమాన విలువ, సమాన అవకా శాలు అనే ప్రజాస్వామిక దృష్టి లేని, స్వార్థ బుద్ధి గల వర్గమే వివక్షతో కూడిన వర్ణధర్మాన్ని సృష్టించింది. హిందూధర్మం అంటే వర్ణధర్మమే. తమకు రిజర్వుడ్ అనుకున్న సామాజిక హోదా, రాజకీయ ఆర్థిక రంగాల్లో అత్యున్నత స్థాయికి విద్యావంతులైన దళితులు, శూద్రులు క్రమంగా గండికొడుతూ ఉండటమే ఈ ఆధిపత్య వర్గాల సమస్య. వీరికి ‘కాగల కార్యం గంధర్వులే తీర్చినట్లు’ దేశంలో అమలైన ప్రైవేటీకరణ విధానాలు వెనుకబడిన వర్గాలకున్న కొద్దిపాటి రిజర్వేషన్ వ్యవస్థను క్రమంగా మాయం చేసి వీరి లక్ష్యాన్ని సుగమం చేశాయి. వీరి రామరాజ్యంలో మెజారిటీ ప్రజలైన శూద్రులు, దళితులకు చదువుండదు, ఆస్తి ఉండదు, ఆధిపత్య కులాలకు అర్థబానిసలుగా సేవచేయటం తప్ప ఇంకేమీ ఉండదు.
 

ఫలితంగా దేనికైనా అడుక్కోవటం తప్ప మరో హోదా ఉండదు. ముస్లింలను, క్రిస్టియన్లను తిట్టటం దాడులు చేయటం అనేది వారికి ముఖ్య లక్ష్యంకాదు, దేశంలో శూద్రులు, దళితులపై సడలుతున్న వారి ఆధిపత్యాన్ని తిరిగి సాధించుకో వటమే వారి అసలు లక్ష్యం. ఇక ఇప్పుడు తమకు పునర్జీవనం పొందుతున్న రామరాజ్యం కావాలా లేక మనుషులందరికీ సమాన హక్కులు, సమాన అవకా శాలు ఇవ్వగల ఆధునిక ప్రజాస్వామ్యం కావాలో తేల్చుకోవాల్సింది దళితులు శూద్ర నిమ్న కులాలే. ఈ సందర్భంలో అన్ని కులవర్గాల నుంచి ఎదిగిన మేధావులు, ప్రజా స్వామికవాదులందరూ న్యాయం వైపు ఉంటారని, ఉండాలనీ కోరుకుంటున్నాం. తక్షణమే కత్తి మహేష్‌పై విధించిన అనాగరికమైన, వివక్షతో కూడిన ‘బహిష్కరణ’ శిక్షను రద్దు చేయాలని డిమాండ్ చేద్దాం. 

- డాక్టర్ ఎస్.తిరుపతయ్య 
మానవ హక్కుల వేదిక. 

English Title
ఆధునిక మనువాద విశ్వరూపం
Related News