ఓటర్ల జాబితాలో స‌వ‌ర‌ణ‌కు చ‌ర్య‌లు

Voter list amendment, Voter list, Sisodia,  Telangana voters (1048)
  • రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సిసోడియా వెల్లడి

అమ‌రావ‌తి: ఓటర్ల జాబితాలో తప్పులను గుర్తించే కార్యక్రమం ప్రారంభించినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సిసోడియా ప్రకటించారు. రాష్ట్రంలో 3,72,00,000 ఓట్లు నమోదయ్యాయని, ఇందులోని తప్పులను గుర్తించేందుకు వారం రోజులపాటు కసరత్తు చేయనున్నట్టు ఆయ‌న తెలిపారు. వెల‌గ‌పూడి సచివాలయంలో సోమ‌వారం జరిగిన మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ ఓటర్ జాబితాలో పేరు లేకపోవడం, చనిపోయిన వారి పేరు తీసివేయకపోవడం, పేరు తప్పుగా నమోదు కావడం, ఫోటో గుర్తించ లేకుండా ఉండటం, వయస్సు, లింగ, రిలేషన్ తప్పుగా నమోదైన వివరాలను గుర్తించే కార్యక్రమం ప్రారంభించినట్టు సిసోడియా వెల్లడించారు. ఓటర్ల జాబితాలో గుర్తించిన తప్పులను క్షేత్ర స్ధాయిలో పరిశీలించేందుకు పంపిస్తామన్నారు. అనంత‌రం నోటీస్ విడుదల చేసి, వారం తరవాత ఓటు ఇవ్వడం, తీసివేయడంతో పాటు, జాబితాలో ఏమైనా తప్పులు ఉంటే ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ స్ధాయిలో సవరించడం జరుగుతుందని ఆయన తెలిపారు. 

కొన్ని నియోజకవర్గాల్లో వేల సంఖ్యలో ఓట్లు తొలగించారనే వార్తలను సిసోడియా కొట్టివేశారు. ఒక ఓటు ఇవ్వాలన్నా, తొలగించాలన్నా డిప్యూటీ కలెక్టర్ స్థాయిలోని ఈఆర్ఓ అధికారి, క్షేత్ర స్థాయిలో భౌతికంగా పరిశీలించిన సమాచారంతో మాత్రమే నిర్ణయం తీసుకుంటారని ఆయన తెలిపారు. ఎవరైనా తమ పేరు ఓటర్ల లిస్టులో లేదని గుర్తిస్తే వెంటనే ఫామ్ 6 లో నమోదు చేసుకోవచ్చని సూచించారు. సీఈసీ పోర్టల్, నేషనల్ వోటర్స్ సర్వర్, సంక్షిప్త సందేశాల ద్వారా ఓటరు జాబితాలో తమ పేరు ఉందా? లేదా అనేది పరిశీలించుకోవచ్చని సిసోడియా చెప్పారు. రెండు ఓట్లు ఉన్నవారు తమ ఇష్టం వచ్చిన చోటు ఉంచుకుని, అవసరం లేనిచోట‌ ఓటు తొలగించుకునేందుకు ఫామ్ 7 ద్వారా వివరాలు నమోదు చేసుకోవాలని సిసోడియా సూచించారు.

సంబంధిత వార్తలు