ఆప్ ఆందోళన

Updated By ManamThu, 06/14/2018 - 00:13
aap

imageసంరక్షకులే తమకు రక్షణ కల్పించమంటూ ప్రాథేయపడినట్లు తమ డిమాండ్ల పరిష్కారం కోసం పాలకులే నిరసనలకు దిగడం ఒక విరోధాభాస. పార్లమెంట్ సమావేశాలను జరగకుండా ప్రతిపక్షం అడ్డుకుంటోందని ఆరోపిస్తూ ప్రధాని నరేం ద్ర మోదీ ఒకరోజు నిరసన దీక్షకు దిగడం నుంచి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రభుత్వాలే నిరసన దీక్షలు చేపట్టడమనే కొత్తధోరణి ఒకటి ముందు కొచ్చింది. ఆ ధోరణికి ఆజ్యుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ముఖ్య మంత్రిగా అధికారం చేపట్టిన తొలిరోజుల్లోనే మత్తుమందులు, వ్యభిచారం నిర్వ హించే మాఫియా యంత్రాంగంపై దాడులు చేయాలని ఢిల్లీ ప్రభుత్వ ఆదేశాలను ఖాతరుచేయని పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని  కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జంతర్‌మంతర్ వద్ద ధర్నాకు దిగారు. ఇప్పుడు తాజాగా నాలుగు నెలలుగా విధులను బహిష్కరించిన ఐఏఎస్ అధికారులకు మార్గదర్శ కాలు జారీ చేయడం సహా మొత్తం మూడు డిమాండ్లను లెఫ్టినెంట్ గవర్నర్ తోసిపుచ్చడంపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సహా ఇద్దరు మంత్రులు ఎల్‌జీ కార్యా లయంలో రెండురోజులుగా బైఠాయించారు. ప్రజలకు రేషన్ సరకులను డోర్ డెలివరీ అందించే ప్రక్రియకు ఆమోదం, నాలుగు నెలలుగా విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్న ఐఏఎస్‌లపై చర్యలు తీసుకోవడం, వారు సమ్మె విరమించేలా ఎల్‌జీ చొరవ చూపాలి అనే మూడు ప్రతిపాదనలను ఎల్‌జీ తిరస్కరించడంతో వేరేమార్గం లేక ఆయన కార్యాలయంలోనే నిరసన ప్రదర్శన కేజ్రీవాల్ ప్రారం భించారు. ఆప్ నేతలు, కార్యకర్తలు ఎల్‌జీ కార్యాలయం వద్దకు చేరుకుంటుం డంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేజ్రీవాల్ ఎలాంటి కారణం లేకుండానే నిరసనకు దిగారని ఎల్‌జీ కార్యాలయం మాటను పక్కనబెట్టినా, ఐఏఎస్ అధికా రులు సమ్మె చేయడం లేదని ఐఏఎస్‌ల సంఘం ఖండించడం ఆయనను ఇరుకున పెట్టింది. 

ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై ఆప్ ఎమ్మెల్యేలు ఫిబ్రవరి 19న దాడి చేసినప్పటి నుంచి నాలుగు నెలలుగా అధికారులు మంత్రివర్గ సమావేశాల వంటి కీలకమైన వాటికి మినహా సాధారణ సమావేశాలకు హాజరు కాకుండా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ప్రజాప్రతినిథులతో కేవలం రాతపూర్వకంగా లావాదేవీలు జరుపుతున్నారే గానీ, వారిని ప్రత్యక్షంగా కలవడం లేదు. సీఎస్‌పై దాడికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు క్షమాపణ చెప్పాలని అధికారులు డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వ అధికారులందరూ విధులకు హాజరల తున్నారే గానీ, రాజకీయ కార్యనిర్వాహకులను ప్రత్యక్షంగా కలువకుండా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి విలక్షణమైన పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రధానంగా కేజ్రీవాల్ బాధ్యత వహించి అధికారులకు క్షమాపణ చెప్పాల్సి ఉంది. ఢిల్లీ సాధా రణ పాలన కుంటుపడి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలగడానికి ప్రధాన బాధ్యత ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వహించకుండా, ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇంటిం టికీ రేషన్ సరఫరా, ఢిల్లీకి ప్రత్యేక హోదా వంటి డిమాండ్లతో ‘ఎల్‌జీ ఢిల్లీ ఛోడో’ నినాదంతో ప్రచారోద్యమాన్ని చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పిస్తే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాము బీజేపీ తరపున ప్రచారం చేస్తామని, ప్రతి ఒక్కరి ఓటు ఆ పార్టీకి అనుకూలంగా పడేలా ఆప్ కృషిచేస్తుందని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. ఒకవేళ రాష్ట్రహోదా కల్పించక పోతే బీజేపీని ఢిల్లీనుంచి తరిమికొట్టాలని ప్రజలకు పిలుపిస్తామని ఆయన హెచ్చరించారు. ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పించాలని ఢిల్లీ అసెంబ్లీ సోమవారం తీర్మానం కూడా చేసింది. 2014 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఢిల్లీకి రాష్ట్ర హోదా కల్పిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీని ఎప్పుడు నెరవేరుస్తారని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో ప్రజాపరిపాలన లేదని, ఎల్‌జీ అనే పేరుతో రాచరిక పాలన సాగుతున్నదని ఆయన విమర్శించారు. ఎల్‌జీ ఢిల్లీ ఛోడో కార్యక్రమాన్ని జులై 1న కార్యకర్తల సమావేశం నుంచి తీవ్రతరం చేస్తామని కేజ్రీవాల్ ప్రకటించడం సంచలనం సృష్టించింది. 

రాజధాని ఢిల్లీ పరిపాలన విషయంలో మౌలిక వైరుధ్యాలు సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నమాట నిజమే. రాజధాని నగరానికి చట్టసభ, మంత్రివర్గం (కేంద్ర పాలిత ప్రాంతాలకు భిన్నంగా) ఉంది. అయితే రాజ్యాంగంలో ఆర్టికల్ 239ఎఎ ప్రకారం ఢిల్లీ ప్రత్యేక రాజ్యాంగ వ్యవస్థ ఏర్పాటుతో రాష్ట్ర ప్రభుత్వ అధి కారాలన్నీ హరించుకుపోతాయి. దేశ రాజధాని కింద విశిష్ట అధికారాలన్నీ ప్రధా నంగా కేంద్రం చేతిలోనే ఉంటాయి. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలో అధికారానికి వచ్చిన ఆప్ ప్రభుత్వం కేంద్రంలో భారీ మెజారిటీతో గద్దెనెక్కిన మోదీ ప్రభు త్వంతో చర్చలు, రాజీల ద్వారా విబేధాలను పరిష్కరించేందుకు శతవిధాల ప్రయ త్నం చేసింది. అయితే గత కొద్దికాలంగా రాష్ట్ర ప్రభుత్వ విధుల్లో ఎల్‌జీ అతిగా జోక్యం చేసుకోవడం మొదలుపెట్టారు. అధికారులు/ సిబ్బంది నియామకాలు, ద ర్యాప్తులు, పరిధుల నియంత్రణల విషయంలో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఎల్‌జీ నిర్ల క్ష్యం చేస్తుండడంతో ఆప్  ఉద్యమబాట పట్టింది. ఢిల్లీ అధికార యంత్రాంగాన్ని నడపడంలో ఎల్‌జీకి హక్కు ఉందని ఢిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది.

అయితే ఎన్ని కైన ప్రభుత్వానికి ప్రజాపనుల నిర్వహణ కోసం అధికారులను నియమించుకునే హక్కు కలిగి ఉందనడాన్ని కాదనలేము. దీనికి దేశ రాజధాని ఢిల్లీ పరిపాలన వ్యవహారంలో ఒక మధ్యేమార్గాన్ని కచ్చితంగా అన్వేషించాల్సి ఉంది. 2003లో ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదాను కల్పించాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభలో బీజేపీ ఒక ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టింది. అదే విధంగా న్యూ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతాల్లోని పరిపాలన బాధ్యతలు కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని, నగరంలోని మిగతా ప్రాంతాలన్నీ రాజ్యాంగం నిర్దేశించిన ‘రాష్ట్ర జాబి తా’లోని అంశాల పరిధిలో రాష్ట్ర ప్రభుత్వ పాలన కొనసాగించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసింది. అలాంటిది ఎల్‌జీ ద్వారా ఢిల్లీ ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాల్జేసి, ప్రజల్లో అభాసుపాలు చేయడం ద్వారా రాబోయే ఎన్నికల్లో లబ్ధిపొందాలని బీజేపీ పన్నాగాల కారణంగా ఆప్‌కు ఆందోళన చేయక తప్పలేదు. బ్రిటిష్ కాలంలో వైస్రాయ్‌ల తరహాలో ఎల్‌జీలను ఢిల్లీపై కేంద్రం బలవంతంగా రుద్దిందంటూ చేసే ఆరోపణలు వాస్తవదూరంగా లేవు. రాష్ట్రాలపై కేంద్రం అధి కార పట్టు బిగించే సంస్కరణలను చేస్తున్న మోదీ ప్రభుత్వ అధికార కేంద్రీకరణ విధానాలను ప్రజలు తిరస్కరించాల్సిన తరుణమిది. 

English Title
AAP asitation
Related News