ఆఫీసులో అంతా నిద్రముచ్చులే

Updated By ManamMon, 06/04/2018 - 14:47
83% Of Employees Taking a Wink Relief In Office
  • 83 శాతం మంది ఆఫీసు పనివేళల్లో గురకేస్తున్నారు

  • 43 శాతం మందికి వెన్ను నొప్పి.. 15 శాతం మందికి నిద్రలేమి

  • హైదరాబాద్ సహా ఏడు నగరాల్లో సర్వే.. విస్తుగొలిపే విషయాలు

83% Of Employees Taking a Wink Relief In Officeహైదరాబాద్: గుర్‌ర్‌ర్‌ర్‌ర్..... గుర్‌ర్‌ర్‌ర్‌ర్... ఏంటి ఆఫీస్ టైంలో, పనివేళలో ఈ గుర్రేమిటి అని గుర్రుగా ఉన్నారా? అంత గుర్రు కావాల్సిన అవసరం లేదు గానీ.. హైదరాబాద్‌లో ఉద్యోగులు ఆఫీసుల్లో చేస్తున్నది ఇదేనంట. దాదాపు 83 శాతం మంది ఆఫీసు పనివేళల్లో కునుకు తీస్తున్నారట. వారంలో మూడు సార్లైనా ఆఫీసులో పనిచేస్తూ కునుకేస్తారట. ఓ అధ్యయనంలో తేలిన విస్తుగొలిపే విషయం ఇది. కారణమేదైతేనేం ఇంట్లో మాత్రం సరిగ్గా నిద్రపోని వారు మాత్రం ఆఫీసుల్లో కానిచ్చేస్తున్నారు. ఎక్కడ జరుగుతుందది.. ప్రభుత్వ ఆఫీసుల్లో తప్ప అని అనుకుంటున్నారా.. ప్రైవేటు ఆఫీసుల్లోనూ ఇదే పరిస్థితి ఉందట. అంతేనా 43 శాతం మంది వెన్ను నొప్పి వస్తోందంటూ చెబితే.. మరో 15 శాతం మంది నిద్ర లేమితో సతమతమవుతున్నారట. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, గురుగ్రామ్, ముంబై, చెన్నై, కోల్‌కతా వంటి టాప్ నగరాల్లో ఈ సర్వే చేశారు.

దాదాపు చాలా మంది నిద్ర సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్టు అధ్యయనంలో తేలింది. రాత్రయితే చాలు.. పడుకోవాలి. కానీ, ఎక్కడ... ఆఫీసంతా పని.. ఇల్లు చేరగానే సెల్ ఫోన్ లేదంటే టీవీయేనాయే. ఇంక నిద్రెక్కడ పడుతుంది. అర్ధరాత్రి 12 దాటితే తప్ప బెడ్డెక్కరాయె.. రెప్ప వాల్చరాయే.. దాదాపు 35 శాతం మంది అదే పరిస్థితి అంటే కళ్లు పెద్దవి చేసుకోవాల్సిందేనేమో. అప్పుడు పడుకుంటారా.. మళ్లీ ఆఫీసు కోసం పొద్దున్నే లేవాలాయే. ఇక, నిద్రెక్కడుంటుంది..? అదే ఆఫీసుల్లో నిద్రముచ్చులను తయారుచేస్తోందిట. కనీసం ఏడు గంటలైనా నిద్ర పోవట్లేదట 31 శాతం మంది జనం. ఇక, 18 ఏళ్ల లోపు పిల్లల గురించి చెప్పేదేముంటుంది... వారు సరిగ్గా నిద్రపోతోంది ఆరు గంటలే. అలా 27 శాతం మంది యువత టీవీ, సెల్‌ఫోన్ వంటి వాటికి దగ్గరై నిద్రకు దూరమైపోతున్నారు. అదే వాళ్ల ఎదుగుదలనూ తొక్కేస్తోంది. ఇక, మహిళల విషయానికొస్తే వారికి నిద్ర ఉంటోంది కేవలం ఐదారు గంటలే. దాదాపు 11 శాతం మంది మహిళలు ఆ సమస్యనే ఎదుర్కొంటున్నారు. గురుగ్రామ్, కోల్‌కతా నగరాల్లోనైతే పరిస్థితి మరింత తీవ్రం.

దీనికంతటికీ కారణాలేవైనా ఉన్నాయంటే.. ఎక్కువగా మొబైల్ పట్టుకోవడం.. చేతిలో టీవీ రిమోట్ పట్టుకుని రాత్రంతా టీవీలు చూడడమేనని తేలింది. నిద్ర సమస్యలకు ప్రధాన కారణం అదే. ఇక, 19 శాతం మంది అయితే, ఆఫీసులో పని అయ్యాక కూడా ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ అంటూ తెల్లవారుజాము దాకా లాప్‌టాప్‌పై వేళ్లాడిస్తూ కూర్చుంటున్నారట. 19 శాతం మందైతే అరె.. సోషల్ మీడియాలో తామేం పోస్ట్ చేసింది.. ఏం పోస్ట్ చేసే దాని గురించే తెగ వెదికేస్తున్నారట. చివరదే గానీ.. అంత తక్కువేమీ కాదీ కారణం.. ఎందుకంటే, తమ భవిష్యత్ ఏమైపోతుందోనన్న బెంగతో తెల్లార్లూ ఆలోచిస్తూ ఉండిపోతున్నారట 19 శాతం మంది జనం. ఇంతకీ ఈ అధ్యయనం చేసిందెవరో చెప్పలేదు కదూ.. Wakefit.co అనే సంస్థ ‘గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్‌కార్డ్ 2018’ పేరిట ఈ సర్వే చేసింది. 

English Title
83% Of Employees Taking a Wink Relief In Office
Related News