'పోలింగ్ ప్రశాంతం.. 67శాతం ఓటింగ్ నమోదు'

Rajat Kumar, Telangana polls, Voting Record, EVM snag, Telangana Voting results

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు అందిన నివేదిక ప్రకారం.. 67 శాతం ఓటింగ్ నమోదైనట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రజత్‌ కుమార్‌ పేర్కొన్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా ఈసారి ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని చెప్పారు. పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు. ఎన్నికల నిర్వహణపై న్యూస్‌ కవరేజీ చేసిన మీడియాకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 2014లో తెలంగాణాలో 69.5 శాతం ఓటింగ్‌ నమోదైందని, ఈసారి 67 శాతం మేర ఓటింగ్‌ నమోదైనట్టు వివరించారు. 

మరో రెండు మూడు శాతం పోలింగ్‌ ముగిసేనాటికి ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. అన్ని పోలింగ్‌ స్టేషన్లలో ఉదయం ఏడున్నర గంటలకే పోలింగ్‌ ప్రారంభమైందని తెలిపారు. కొన్ని చోట్ల ఈవీఎం, వీవీపాట్‌లు మొరాయించినప్పటికీ సకాలంలో వాటి స్థానంలో వేరే వాటిని అమర్చినట్టు చెప్పారు. ఎన్నికల అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించారని కొనియాడారు. 754 బ్యాలెట్‌ యూనిట్లు, 628 కంట్రోల్‌ యూనిట్లు, 1444 వీవీపాట్‌లు పోలింగ్‌ జరుగుతుండగా మార్చినట్లు రజత్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు