మేమిద్దరం 50:50

mayawati
  • యూపీలో తలో 38 స్థానాల్లో పోటీ

  • మాయావతి, అఖిలేశ్ ప్రకటన

  • కాంగ్రెస్‌కు అమేథీ, రాయ్‌బరేలి

  • వాళ్లతో పొత్తు పెట్టుకోవడం వృథా

  • మా ఓట్లు వాళ్లకు బదిలీ అవుతాయి

  • బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శ

  • కార్యకర్తలకు అఖిలేశ్ సూచన

లఖ్‌నవూ: ఒకప్పటి బద్ధ శత్రువులైన సమాజ్ వాదీ పార్టీ, బహుజన సమాజ్ వాదీ పార్టీ అధినేతలు అఖిలేశ్ యాదవ్, మాయావతి చేతులు కలిపారు. 2019 మే నెల లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. తమ ఉమ్మడి శత్రువు బీజేపీని ఎదుర్కోడానికి తమకు కాంగ్రెస్ పార్టీ అవసరం లేదని తేల్చిచెప్పేశారు. వాళ్లను కలుపుకోవడం వల్ల అసలు తమకు ప్రయోజనం ఏమీ ఉండబోదన్నారు. ఇక తమ పొత్తుతో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి.. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు నిద్రలేని రాత్రులు తప్పవని హెచ్చరించారు. రెండు పార్టీలు తలో 38 లోక్‌సభ స్థానాలలో.. అంటే 50:50 ప్రాతిపదికన పోటీ చేయనున్నాయి. ముందునుంచి అనుకుంటున్నట్లుగా రాహుల్ గాంధీ పోటీ చేసే అమేథీ, సోనియా గాంధీ పోటీ చేసే రాయ్‌బరేలి స్థానాలను మాత్రం వదిలిపెడుతున్నారు. దాదాపు పాతికేళ్ల క్రితం అఖిలేశ్ యాదవ్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ, మాయావతి నేతృత్వంలోని బీఎస్పీల మధ్య విభేదాలు రావడంతో నాడు యూపీలోని సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. 1995 నుంచి ఇప్పటివరకు రెండు పార్టీలు బద్ధశత్రువులుగా వ్యవహరించాయి. సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొలగి ప్రభుత్వం కూలిపోయేలా చేసినందుకు సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు ఒక గెస్ట్‌హౌస్‌లో ఉన్న మాయావతిని చుట్టుముట్టి దాదాపు కొట్టినంత పని చేయడంతో ఇరు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు జాతి ప్రయోజనాల కోసం తాము లఖ్‌నవూ గెస్ట్‌హౌస్ ఘటనను మర్చిపోవాలని, మళ్లీ కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. అదే సమయంలో అఖిలేశ్ యాదవ్ కూడా తమ పార్టీ కార్యకర్తలకు స్పష్టంగా చెప్పారు. ‘‘మా కార్యకర్తలందరికీ ఒకటే చెప్పదలచుకున్నా. మాయావతిజీకి ఏ చిన్న అవమానం జరిగినా అది వ్యక్తిగతంగా నన్ను అవమానించినట్లే’’ అని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీని కూడా కలుపుకొన్నంత మాత్రాన తమకు ప్రయోజనం ఏమీ ఉండబోదని, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నా వాళ్ల ఓట్లు తమకు బదిలీ కావు కాబట్టి వాళ్లతో పొత్తు అవసరం లేదని నిర్ణయించుకున్నట్లు మాయావతి చెప్పారు. దాంతో ఇక యూపీలో ఎస్పీ-బీఎస్పీ కూటమిలో కాంగ్రెస్‌కు స్థానం లేదని స్పష్టమైపోయింది. గత సంవత్సరం జరిగిన ఉప ఎన్నికలలో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసి సత్ఫలితాలు సాధించడంతో ఇప్పుడు మరోసారి ఇద్దరూ కలిసే బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రాతినిధ్యం వహించిన గోరఖ్‌పూర్ స్థానంలో కూడా భువా-భతీజా (అత్తా అల్లుళ్ల) కాంబినేషన్ విజయం సాధించడంతో వీరిద్దరి పొత్తు మరో స్థాయికి ఎదిగింది. తమ రెండు పార్టీలు కలిసి గత ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించాయని, కాంగ్రెస్ పార్టీ మాత్రం డిపాజిట్లు కూడా కోల్పోయిందని.. అందువల్ల ఎస్పీ బీఎస్పీ కలిస్తే బీజేపీపై గెలవగలమన్న విశ్వాసం తమకొచ్చిందని మాయావతి చెప్పారు. ఇది కేవలం ఎన్నికల్లో గెలవడానికి పెట్టుకున్న పొత్తు కాదని, దళితులు, ముస్లింలు, ఇతర మతపరమైన మైనారిటీల ప్రయోజనాలు కాపాడేందుకే కలిశామని అన్నారు. ఈ బంధం సుదీర్ఘకాలం కొనసాగుతుందని కూడా మాయావతి తెలిపారు. ‘‘యే లంబా చలేగా’’ అని ఆమె అన్నారు. ఈసారి జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ తాము కలిసే పోటీ చేస్తామన్నారు. మాయావతిని ప్రధానమంత్రి అభ్యర్థిగా చేస్తారా అని విలేకరులు అడిగినప్పుడు.. యూపీ గతంలోనూ ప్రధానమంత్రులను ఇచ్చిందని.. మరో ప్రధానమంత్రి యూపీనుంచే వస్తే తమకు చాలా సంతోషమని అఖిలేశ్ అనడంతో మాయావతి ముఖంలో చిరునవ్వులు విరిశాయి. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల తమకు గానీ, సమాజ్‌వాదీకి గానీ ఎలాంటి ఉపయోగం ఉండబోదని తమకు బాగా తెలుసని మాయావతి చెప్పారు. గత అనుభవాలను బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ తమకు ఓట్లు బదిలీ చేయదని తెలిసిందని, బహుశా వాళ్ల ఓట్లు బీజేపీకి బదిలీ చేయడానికి కుట్ర పన్నినట్లున్నారని ఆమె అన్నారు. తమ ఓట్లు కాంగ్రెస్‌కు వెళ్లాయి గానీ, అటు నుంచి ఇటు రాలేదని, దీన్ని 1996లో కూడా తాము అర్థం చేసుకన్నామని అన్నారు. సమాజ్‌వాదీకి 2017 అసెంబ్లీ ఎన్నికల్లో అదే అనుభవం ఎదురైందని తెలిపారు. ఆ ఎన్నికల్లో రాహుల్ - అఖిలేశ్ ఫొటోలు పోస్టర్ల మీద వేసి ‘యూపీ కుర్రాళ్లు’ అని స్లోగన్లు రాసినా ఎలాంటి ప్రభావం కనిపించలేదు. రక్షణ ఒప్పందాల అవినీతిలో కాంగ్రెస్, బీజేపీ ఇద్దరూ దోషులేనని మాయావతి విమర్శించారు. 1975-77 మధ్య కొనసాగిన ఎమర్జెన్సీని కూడా ఆమె ప్రస్తావించారు.

సంబంధిత వార్తలు