25 జిల్లాలు చేస్తా

YS Jagan Mohan Reddy
  • పేద ప్రజలకు.. గుండె చప్పుడునవుతా

  • ప్రజాసంక్షేమం కోసం కడదాకా జీవిస్తా

  • పాదయాత్రలో మీ కష్టాలు తెలుసుకున్నా

  • నడిచింది నేను.. కానీ నడిపించింది మీరే

  • మేమొస్తే ప్రజలకు ఇంకా చేరువగా పాలన

  • గ్రామానికో సచివాలయం.. ఇంటికే పథకాలు

  • పాదయాత్ర ముగింపు సభలో జగన్మోహన్‌రెడ్డి

శ్రీకాకుళం/ ఇచ్ఛాపురం: అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా చేస్తానని వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. పంట పెట్టుబడికి ఎకరాకు ఏడాదికి రూ. 12,500 చొప్పున ఇస్తామని, పంట బీమాను పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుందంటూ రైతులపై వరాలజల్లు కురిపించారు. ప్రతి గ్రామంలో సచివాలయం ఏర్పాటుచేసి.. ప్రజలకు అత్యంత చేరువగా పాలన తీసుకొస్తామన్నారు. గ్రామ వలంటీర్లను నియమించి.. వారితో లబ్ధిదారుల ఇంటి ముంగిటకే పథకాలన్నీ అందజేస్తామని తెలిపారు. ఆక్వా రైతులకు యూనిట్ రెంటు రూపాయిన్నరకే ఇస్తామని అన్నారు. 341 రోజుల పాటు రాష్ట్రంలోని 13 జిల్లాలలో 134 నియోజకవర్గాలు.. 2,516 గ్రామాలలో సాగిన ‘ప్రజాసంకల్ప యాత్ర’ ముగిసిన సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో బుధవారం ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మొత్తం 3,648 కిలోమీటర్ల దూరం ఆయన నడిచారు. పాదయాత్రలో భాగంగా 124 బహిరంగ సభలలో పాల్గొనడంతో పాటు.. 55 ఆత్మీయ సమ్మేళనాలు కూడా నిర్వహించారు. ఇన్నివేల కిలోమీటర్ల పాదయాత్రలో.. ప్రజల గుండెచప్పుడునే తన గుండె చప్పుడుగా మార్చుకున్నానని బహిరంగ సభలో ఆయన చెప్పారు. ప్రజల ఆశీర్వాదమే తనకు అండ..దండగా నిలిచిందని తెలిపారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దీవెనలతో పాటు దేవుని ఆశీస్సులతో ముందుకస్ సాగుతున్నానన్నారు. ప్రజా సంకల్పయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్ఛాపురంలోని పాతబస్టాండ్ వద్ద నిర్వహించిన బహిరంగ సభకి తరలివచ్చిన అశేష జనవాహినిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 

సీఎం.. అంటూ మార్మోగిన నినాదాలు
జగన్ తన ప్రసంగం ప్రారంభించడానికి ఉద్యుక్తులు అవుతుండగానే, ఒక్కసారిగా అక్కడున్న అశేష ప్రజానీకం ‘సీఎం.. సీఎం’ అంటూ దిక్కులు మార్మోగేలా నినాదాలు చేసి ఆయనను ఉత్సాహపరిచారు. అనంతరం జగన్ మాట్లాడుతూ, నడిచింది తానైనా.. నడిపించింది మాత్రమే మీరేనన్నారు. హైదరాబాద్ నుంచి దుబాయ్ 3 వేల కిలోమీటర్లు.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దూరం 3440 కి.మీ. అని.. పాదయాత్ర ఆ రికార్డులన్నింటినీ దాటేసిందని చెప్పారు. ఎంత దూరం నడిచాం అన్నది ముఖ్యం కాదని.. ఎంతమంది ప్రజలను కలిశాం, ఎందరికి భరోసా ఇచ్చామన్నదే ముఖ్యమని అన్నారు. 600 హామీలు ఇచ్చి.. ప్రతీ కులాన్నీ ఎలా మోసం చేయవచ్చన్న విషయంలో పీహెచ్‌డీ చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు అని విమర్శించారు. రాష్టంలో కరువు పరిస్థితులుంటే.. రెయిన్‌గన్‌ల పేరుతో చంద్రబాబు సినిమా చూపించారంటూ అనంతపురం జిల్లాకు చెందిన రైతు శివన్న యథార్థ గాధ వినిపించారు. జాతీయ రాజకీయాల పేరుతో కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్ తిరుగుతారు కానీ.. మన రాష్ట్రంలో రైతన్నల కష్టాలను తీర్చాలన్న ధ్యాసే చంద్రబాబుకు లేదన్నారు. వ్యవసాయ ఆదాయంలో మన రాష్ట్ర రైతులు దేశంలోనే 28వ స్థానంలో,  అప్పుల్లో రెండో స్థానంలో ఉంటే.. గ్రోత్ రేట్ లో నెంబర్ 1 అంటూ చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నా రన్నారు. పొదుపు సంఘాలకు చెందిన అక్కచెల్లెమ్మల రుణాలు చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి రూ. 14,2014 కోట్లు ఉంటే... ఇప్పుడు వాటి వడ్డీలు పెరిగిపోయి రూ. 22,174 కోట్లకు చేరాయని,  సున్నా వడ్డీ రుణాలకు కూడా బాబు ఎగనామం పెట్టాడన్నారు. రాష్ట్ర విభజన సమయంలో 1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే.. ఇప్పుడవి 2.40 లక్షలకు పెరిగినా.. ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదన్నారు. ప్రతి ఇంటికీ రూ. 2వేలు నిరుద్యోగ భృతి ఇస్తానని ఎన్నికలకు ముందు చెప్పి.. ఇప్పుడు మళ్లీ ఎన్నికలకు మూడు, నాలుగు నెలల ముందు, అదీ కొద్దిమందికే వెయ్యి ఇస్తానంటున్నాడని విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. అక్షరాలా 6 వేల ప్రభుత్వ స్కూళ్లు మూసేశారని.. ఎస్సీ, ఎస్టీల హాస్టళ్లు మూతపడ్డాయని.. కవిటి మండలంలో ఓ జూనియర్ కాలేజీలో కనీసం బాత్రూంలు కూడా లేవని ఓ విద్యార్థిని తనకు చెప్పిందని సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజులు కట్టలేక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలో 23వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. ఉన్న బడుల్లో టీచర్లు లేరు, పుస్తకాలు ఇవ్వటం లేదని, ఇలా ప్రభుత్వ స్కూళ్ళను నిర్వీర్యం చేస్తూ.. నారాయణ, చైతన్య సంస్థలను మాత్రం పెంచుతున్నారని మండిపడ్డారు. నెట్‌వర్క్ ఆసుపత్రులకు 8 నెలలుగా బకాయిలు చెల్లించకపోవడంతో.. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని తెలిపారు. ఉద్దానంలో 4 వేల మంది కిడ్నీ రోగులు డయాలసిస్ చేయించుకుంటా ఉంటే.. కేవలం 1400 మందికి మాత్రమే ప్రభుత్వం వైద్యం అందిస్తోందని, పింఛన్లు కూడా 370 మందికే ఇస్తోందని జగన్ అన్నారు. 108 అంబులెన్స్ వస్తుందో.. రాదో తెలియని పరిస్థితి ఉందని తెలిపారు. జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా నడుస్తోందని, రేషన్ కార్డు నుంచి మరుగుదొడ్డి వరకూ ఏది కావాలన్నా.. లంచం తప్పట్లేదని మండిపడ్డారు. పెన్షన్ కావాలంటే ఏ పార్టీ అని అడుగుతున్నారు. పెన్షన్ కావాలంటే బతికి ఉన్నా.. సర్టిఫికెట్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఎన్నికలొచ్చేటప్పటికి చంద్రబాబుకు భయం పట్టుకుందని, అందుకే ఆదరణ-2 అని, కొత్త ఇళ్ళు, పెన్షన్లు.. మరొకటి అని డ్రామాలు ఆడుతూ కొత్త సినిమా చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు.
 
నాయకులను పంపేయండి..
ఎన్నికల ముందు తాము చెప్పింది చేయపోతే.. ఆ నాయకుడితో రాజీనామా చేయించి ఇంటికి పంపేసేలా చేయాలని జగన్ అన్నారు. రాష్ట్రంలో అలాంటి విశ్వసనీయ రాజకీయాలు రావాలని, చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను మార్చాలంటే.. అది జగన్ ఒక్కడి వల్ల సాధ్యపడదని.. జగన్‌కు మీ అందరి దీవెనలు కావాలని కోరారు. ప్రతి పథకం ప్రతి పేదవాడి ఇంటికి చేరాలని.. ఆ పేదవాడు ఏ పార్టీ, ఏ కులం, మతం, అనేది అడ్డు కాకూడదని చెప్పారు. 

నేనేం చేస్తానంటే...
తమ పార్టీ అధికారంలోకి వస్తే 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ను 25 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌గా మారుస్తామని వైఎస్ జగన్ చెప్పారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్నీ ఒక జిల్లాగా చేస్తానని, ఇలా వాబుదారీతనం పెంచుతా మని అన్నారు. కలెక్టర్లను ప్రజలకు మరింత చేరువ చేస్తామని, దాంతో పాలన కూడా చేరువ అవుతుందని తెలిపారు. ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయాన్ని తీసుకొస్తామని, స్థానికులకే 10 మందికి ఉద్యోగాలు ఇసా ్తమని.. ప్రతి పథకం పేదవాడి ఇంటి ముందుకే వచ్చేలా చేస్తానని అన్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒకరికి గ్రామ వాలంటీర్‌గా తీసుకొని వీరికి రూ. 5 వేలు జీతం ఇస్తామని చెప్పారు. వాళ్లు ఆ 50 ఇళ్లకు జవాబుదారీగా ఉండి, నవర త్నాల నుంచి రేషన్ బియ్యం వరకూ.. నేరుగా ఇంటికే వచ్చేలా డోర్ డెలివ రీ చేస్తారన్నారు. రైతులకు పగటిపూటే 9 గంటలపాటు ఉచితంగా కరెంటు ఇస్తామని.. ప్రతి రైతు ఆదాయం పెంచడానికి.. బ్యాంకు రుణాలపై వడ్డీ లేకుండా సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తామని అన్నారు. మే నెలలోనే రైతన్నకు పెట్టుబడి కోసం ఏడాదికి రూ. 12,500 ఇస్తామని, రైతులందరికీ బోర్లు ఉచితంగా వేయిస్తామని, పంట బీమాను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. ఆక్వా రైతుకు రూపాయిన్నరకే కరెంటు ఇస్తామని, గిట్టుబాటు ధరల కోసం రూ.3000 కోట్లతో ధరల స్థిరీకరణ తీసుకొస్తామ ని.. ప్రతి మండలంలోనూ కోల్డ్‌స్టోరేజీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.పాడి ప్రోత్సాహం కోసం.. లీటరుకు రూ. 4 బోనస్ ఇస్తామని, సహకార రంగం డైరీలను ప్రతి జిల్లాలో ప్రోత్సహిస్తామని చెప్పారు. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్‌ట్యాక్స్‌ను పూర్తిగా రద్దు చేస్తామన్నారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రైతు నష్టపోకుండా.. రూ. 4 వేల కోట్లతో ప్రత్యేక నిధి పెడతామన్నారు. కొబ్బరి చెట్లకు పరిహారం రూ. 3 వేలు, జీడిమామిడి చెట్లకు ఇప్పుడు ఇస్తున్న రూ. 30 వేలను రూ.50 వేలకు పెంచుతామని చెప్పారు. రైతన్నకు జరగకూడని నష్టం ఏమైనా జరిగితే.. వైయస్‌ఆర్ బీమా కింద రూ. 5 లక్షలు వెంటనే ఆ కుటుంబానికి ఇస్తామని.. అది పూర్తిగా ఆడపడుచులకు ఇచ్చే సొత్తుగా చూసేలా అసెంబ్లీలో చట్టం చేస్తామని, దాంతో అప్పుల వాళ్ళు లాక్కొనే అవకాశం ఉండదని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ నేతలు ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తలశిల రఘురాం, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యన్నా రాయణ, భూమన కరుణాకర్‌రెడ్డి, తమ్మినేని సీతారాం, ధర్మాన కృష్ణదాస్, దువ్వాడ శ్రీనివాస్, పిరియా సాయిరాజ్, గొర్లె కిరణ్‌కుమార్, పేరాడ తిలక్‌లతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన పార్టీ అగ్రనేత లు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు