అమెరికాలో కాల్పులు.. 12మంది మృతి

Updated By ManamFri, 11/09/2018 - 08:56
America

Americaకాలిఫోర్నియా: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. సంగీత హోరులో మునిగితేలిన యువతే లక్ష్యంగా నౌకాదళ మాజీ మెరీన్ ఉద్యోగి చేసిన కాల్పుల్లో 12మంది దుర్మరణం చెందారు. మరో 21మంది గాయపడ్డారు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజిలెస్ శివార్లలో ఈ ఘటన జరిగింది. 

అక్కడ ఓ బార్‌లో కాలేజీ విద్యార్థుల కోసం వెడ్‌నెస్‌డే నైట్ పార్టీని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వందల మంది యువతీ యువకులు వెళ్లారు. యువతీ యువకులంతా ఉల్లాసంతా ఆడుతూ పాడుతూ ఉన్న సమయంలో నౌకాదళ మాజీ మెరీన్ ఉద్యోగి ఇయాన్ డేవిడ్ లాంగ్ బార్‌లోకి ప్రవేశించాడు. వచ్చీ రాగానే పొగ బాంబులు విసిరి గందరగోళం సృష్టించిన డేవిడ్.. ఆ వెంటనే పిస్తోలుతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఉలిక్కిపడ్డ యువత ఆర్తనాదాలు చేసుకుంటూ తలోదిక్కుకు పలుగురు తీశారు. ఈ క్రమంలో 10మంది చనిపోగా, కొంతమంది గాయపడ్డారు.

విషయం తెలియగానే రంగంలోకి దిగిన పోలీస్ బృందాలు బార్‌ను చుట్టుముట్టాయి. అనంతరం బార్‌లోకి వెళ్లిన ఓ పోలీస్ అధికారి రాన్‌పై డేవిడ్ కాల్పులు జరపగా.. తీవ్రగాయాలపాలైన ఆయన ఆసుపత్రిలో తుదిశ్వాసను విడిచాడు. ఆ తరువాత తనను తాను కాల్చుకొని మరణించాడు డేవిడ్. కాగా అమెరికా నౌకాదళంలోని ప్రతిష్టాత్మక మెరీన్ కోర్‌లో పనిచేసిన డేవిడ్, చిన్నపాటి నేరాలకు పాల్పడేవాడని, కానీ ఈ చర్యకు ఎలా పాల్పడ్డాడో కారణం కనుక్కుంటామని అధికారులు తెలిపారు. మరోవైపు డేవిడ్ ఇంట్లోనూ అధికారులు సోదాలు చేస్తున్నారు. కాగా పది రోజుల క్రితం అమెరికాలోని యూదుల ప్రార్థన స్థలంలో జరిపిన కాల్పుల్లో 11మంది మరణించిన విషయం తెలిసిందే.

English Title
12 people killed in California bar shooting
Related News